Hardik Pandya Fined: హార్దిక్‌కు భారీ ఫైన్.. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన గుజరాత్ కెప్టెన్-gujarat titans captain hardik pandya fined rs 12 lakh for slow over rate against punjab ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya Fined: హార్దిక్‌కు భారీ ఫైన్.. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన గుజరాత్ కెప్టెన్

Hardik Pandya Fined: హార్దిక్‌కు భారీ ఫైన్.. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన గుజరాత్ కెప్టెన్

Maragani Govardhan HT Telugu
Apr 14, 2023 06:22 PM IST

Hardik Pandya Fined: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైన్ విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడు రూ.12 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (PTI)

Hardik Pandya Fined: పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. గత మ్యాచ్‌ ఓటమి నుంచి పుంజుకున్న గుజరాత్.. పంజాబ్‌పై చివరి బంతి వరకు పోరాడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మూడుకు పెంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యకు ఫైన్ వేశారు. దాదాపు రూ.12 లక్షలను చెల్లించాల్సిందిగా ఐపీఎల్ చర్య తీసుకుంది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధించడం ఇదే మొదటిసారి. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కారణంగా ఆ జట్టు కెప్టెన్‌పై ఈ చర్య తీసుకున్నారు. గుజరాత్ తనకిచ్చిన సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ నియమాల ప్రకారం మ్యాచ్‌ను 3 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. లేని పక్షంలో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన కింద ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

"స్లో ఓవర్ రేట్ శిక్షకు సంబంధించి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు చేసిన మొదటి తప్పు కావడంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించడమైంది." అని ఐపీఎల్ మీడియా సలహా దారు శుక్రవారం నాడు తెలిపారు.

కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ చివరి ఓవర్లో 5 సిక్సర్లతో విజృంభించడంతో గుజరాత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ పరాజయం నుంచి కోలుకుని తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది గుజరాత్. మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన మోహిత్ శర్మ 2 వికెట్లతో రాణించడంతో పంజాబ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనంలో చివరి బంతి వరకు పోరాడి 154 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

Whats_app_banner