Hardik Pandya: అసలు అనుభవమే లేని హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదే: కోచ్ నెహ్రా
Hardik Pandya: అసలు అనుభవమే లేని హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఏంటో వివరించాడు గుజరాత్ టైటన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా. నిజానికి పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై అప్పట్లో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. కెప్టెన్ గా అతడి సామర్థ్యం ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది.
Hardik Pandya: ఐపీఎల్లోకి గతేడాది ఎంట్రీ ఇచ్చిన టీమ్ గుజరాత్ టైటన్స్. సీఎస్కే, ముంబై, ఆర్సీబీలాంటి టీమ్స్ తో పోలిస్తే పెద్దగా స్టార్లు లేని టీమ్ అది. పైగా అప్పటి వరకూ అసలు కెప్టెన్సీ అనుభవమే లేని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు లేవనెత్తారు. కానీ తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచి హార్దిక్ ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు.
తాజాగా గుజరాత్ టైటన్స్ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన కోచ్ ఆశిష్ నెహ్రా.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. "నువ్వే కెప్టెన్ అని అతనికి ఫోన్లో చెప్పాను. కెప్టెన్సీకి అతడు సిద్ధంగా ఉన్నాడు. చాలా ఉత్సాహంగా కనిపించాడు. హార్దిక్ లాంటి వ్యక్తికి ఆకాశమే హద్దు" అని నెహ్రా అన్నాడు. అసలు అతన్ని ఎందుకు కెప్టెన్ గా ఎంచుకున్నారన్న ప్రశ్నకు కూడా నెహ్రా స్పందించాడు.
హార్దిక్ సక్సెస్ అవుతాడని తెలుసు
"హార్దిక్ ఎప్పుడూ తుది జట్టులో ఉంటాడని మాకు తెలుసు. అందుకే కెప్టెన్సీ ఇచ్చాం. అతడు గ్యారీ కిర్‌స్టెన్, విక్రమ్ సోలంకితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి ఈగో సమస్యలు లేవు. ఓ వ్యక్తిగా హార్దిక్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. కానీ అతడు చాలా మారాడు. హార్దిక్ నా కన్న 15 ఏళ్లు చిన్నవాడు. అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను" అని నెహ్రా చెప్పాడు.
"ఏదైనా ఏదో ఒక చోటు నుంచి ప్రారంభం కావాల్సిందే. హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడినప్పుడు అతడు ఎలాంటి ప్లేయరో చర్చించాల్సిన అవసరం లేదు. అతనికి ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయి. కానీ అది ఏ క్రికెటర్ కైనా సహజమే. అన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ పర్సన్ జీవితం ఒకేలా ఉండదు.
నేను టీమిండియాలోనే కొన్ని రోజులు హార్దిక్ తో కలిసి ఆడాను. అతడు ఎప్పుడూ తన సహనం కోల్పోడు. అతడు కెప్టెన్సీ చేపట్టి ఏడాదే అయింది. టీమిండియా కెప్టెన్సీ కూడా చేపడుతున్నాడు. రానున్న నాలుగైదేళ్లలో అతడు ఇంకా నేర్చుకుంటాడు. ఓ కోచ్ గా నేను అతనికి అవసరైన సాయం చేస్తున్నాను" అని నెహ్రా చెప్పాడు.
సంబంధిత కథనం