AB de Villiers on IPL 2023: ఆర్సీబీ గెలవాలని నాకూ ఉంది కానీ.. ఐపీఎల్ 2023 విజేతపై ఏబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
AB de Villiers on IPL 2023: ఆర్సీబీ గెలవాలని నాకూ ఉంది కానీ అంటూ ఐపీఎల్ 2023 విజేతపై ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్ ఎవరు గెలుస్తారో కూడా అతడు చెప్పేశాడు.
AB de Villiers on IPL 2023: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ స్టార్లు ఎంతో మంది ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్. ప్రతి సీజన్ లోనూ ఫేవరెట్లలో ఒకటిగా దిగి నిరాశపరుస్తూనే ఉంది. మరి ఈసారైనా ఆ టీమ్ టైటిల్ గెలుస్తుందా? దీనికి ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.
తనకూ ఆర్సీబీ గెలవాలని ఉంది కానీ.. తన అంచనా ప్రకారం ఈసారి కూడా గుజరాత్ టైటన్సే ట్రోఫీ గెలుస్తుందని ఏబీడీ చెప్పడం విశేషం. "అది చెప్పడం చాలా కష్టం. చాలా రోజుల కిందట ఐపీఎల్ వేలం సందర్భంగా నేను గుజరాత్ టైటన్స్ రెండు వరుస టైటిల్స్ గెలుస్తుందని చెప్పాను. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నిజానికి ఆర్సీబీ గెలవాలని నాకూ ఉంది. గతేడాది నుంచి ఆర్సీబీ చాలా బాగుంది. వాళ్లకు తగిన వనరులు ఉన్నాయి. ఆర్సీబీ గెలుస్తుందని ఆశిస్తున్నా" అని ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఏబీ అన్నాడు.
ఇక విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడని ఏబీ అనడం విశేషం. "గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడు చాలా ప్రశాంతంగా ఉన్నాడనిపిస్తోంది. అతడు అద్భుతమైన కెప్టెన్. అయితే ఆ భారాన్ని అంటు అంతర్జాతీయంగా, ఇటు ఐపీఎల్లో చాలా కాలం మోశాడు. అతనికి కుటుంబంతో గడపడానికి, ఎంజాయ్ చేయడానికి తగిన సమయం కూడా దొరకలేదు. అందుకే ఈ సీజన్ లో అతడు ఫీల్డ్ లో దిగి సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడు" అని డివిలియర్స్ అన్నాడు.
కోహ్లిలో ఎలాంటి మార్పు లేదని, పూర్తి ఎనర్జీతో క్రీజులో కనిపిస్తున్నాడని ఏబీ చెప్పాడు. ఈ సీజన్ కు అతడు చాలా ప్రశాంతంగా వచ్చాడని, అతని ఇంటర్వ్యూలు చూస్తే ఎప్పుడూ లేనంత నవ్వుతూ కనిపిస్తున్నాడని అన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే ముంబైపై ఆర్సీబీ గెలవగా.. అందులో కోహ్లి 82 రన్స్ తో అజేయంగా నిలిచాడు. గురువారం (ఏప్రిల్ 6) కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ తమ రెండో మ్యాచ్ ఆడబోతోంది.
సంబంధిత కథనం