Rajat Patidar ruled out: ఆర్సీబీకి భారీ షాక్.. గాయంతో రజత్ పటీదార్ ఔట్
Rajat Patidar ruled out: ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. గాయంతో రజత్ పటీదార్ ఐపీఎల్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. గతేడాది ఆర్సీబీ తరఫున రజత్ రాణించిన విషయం తెలిసిందే.
Rajat Patidar ruled out: ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ ను ఓడించి ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ రజత్ పటీదార్ గాయం కారణంగా ఐపీఎల్ 2023 మొత్తానికీ దూరమయ్యాడు. మంగళవారం (ఏప్రిల్ 4) ఆర్సీబీ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
తొలి మ్యాచ్ లో విజయంతో బోణీ చేసిన ఆర్సీబీ.. తమ తర్వాతి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. రజత్ పటీదార్ మడమ గాయంతో బాధపడుతున్నాడు. అతని స్థానంలో ఎవరు అన్నది ఆర్సీబీ ఇంకా నిర్ణయించలేదు.
"దురదృష్టవశాత్తూ రజత్ పటీదార్ మడమ గాయం కారణంగా ఐపీఎల్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అందుకు పూర్తి మద్దతు ఇస్తాం. రజత్ స్థానంలో ఎవరు అన్నదానిపై కోచ్ లు, మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని ఆర్సీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
గతేడాది ఐపీఎల్లో రజత్ చాలా బాగా రాణించాడు. దీంతో ఆర్సీబీ అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఈ సీజన్ లోనూ ఆ టీమ్ బలమైన బ్యాటింగ్ లైనప్ లో ఒకడిగా నిలుస్తాడని భావించారు. కానీ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)లో రీహ్యాబిలిటేషన్ కోసం వెళ్లనున్నాడు.
రజత్ ఐపీఎల్ 2023 ఫస్ట్ హాఫ్ కు దూరమయ్యే అవకాశం ఉన్నదని గతంలో వార్తలు వచ్చాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రజత్ ఐపీఎల్లో 12 మ్యాచ్ లు ఆడాడు. 2021లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అతడు.. ఆ తర్వాత ఆర్సీబీకి వెళ్లాడు. 40 సగటుతో 404 రన్స్ చేశాడు. ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ ను గురువారం (ఏప్రిల్ 6) కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.
సంబంధిత కథనం