IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో గుజరాత్ స్థానం ఇదీ.. ఆరెంజ్ క్యాప్ ధావన్ దగ్గరే..
IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటన్స్ పైకి దూసుకెళ్లింది. మరోవైపు ఆరెంజ్ క్యాప్ మాత్రం ఇప్పటికీ ధావన్ దగ్గరే ఉంది. గురువారం (ఏప్రిల్ 13) గుజరాత్, పంజాబ్ మ్యాచ్ తర్వాత టేబుల్లో ఎవరి స్థానం ఏదో ఒకసారి చూద్దాం.
IPL 2023 Points Table: ఐపీఎల్లో గురువారం (ఏప్రిల్ 13) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో మరో బాల్ మిగిలి ఉండగా గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్.. మూడోస్థానానికి దూసుకెళ్లింది. ఆరు వికెట్లతో మ్యాచ్ గెలిచిన జీటీ.. కేకేఆర్ ను వెనక్కి నెట్టింది.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హీరో అయినా కూడా చివరి ఓవర్లో అతడు ఔటైన తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే మరోసారి ఉత్కంఠభరిత క్షణాల్లో రాహుల్ తెవాతియా ఫోర్ కొట్టి గుజరాత్ ను గెలిపించాడు. 154 పరుగులు లక్ష్యమే అయినా.. ఈ మ్యాచ్ చివరి వరకూ ఆసక్తికరంగా సాగింది. మూడేళ్ల తర్వాత ఐపీల్లోకి తిరిగి వచ్చిన మోహిత్ శర్మ 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ విజయంతో గుజరాత్ మూడోస్థానానికి వెళ్లగా.. కేకేఆర్ నాలుగో స్థానానికి పడిపోయింది. చెన్నై 5, పంజాబ్ 6, ఆర్సీబీ 7, ముంబై 8, హైదరాబాద్ 9, ఢిల్లీ పదో స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 14) కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ తర్వాత ఇందులో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఆరెంజ్ క్యాప్ ధావన్ దగ్గరే
ఇక అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్.. ఇప్పటికే శిఖర్ ధావన్ దగ్గరే ఉంది. గుజరాత్ తో మ్యాచ్ లో అతడు 8 పరుగులకే ఔటైనా.. 233 పరుగులతో టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ టాప్ 5లోకి వచ్చాడు. అతడు 183 పరుగులతో ఐదోస్థానంలో ఉన్నాడు. వార్నర్ (209), బట్లర్ (204), రుతురాజ్ గైక్వాడ్ (194) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
పర్పుల్ క్యాప్‌లో చహల్
ఇక అత్యధిక వికెట్లు తీసుకున్న వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ లో యుజువేంద్ర చహల్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. చహల్ 10 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాతి స్థానాల్లో రషీద్ ఖాన్ (9), మార్క్ వుడ్ (9), అల్జారీ జోసెఫ్ (7), అర్ష్‌దీప్ సింగ్ (7) ఉన్నారు.
సంబంధిత కథనం