Gavaskar on GT: ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటన్స్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పేంటో ఎత్తి చూపాడు సునీల్ గవాస్కర్. వరుసగా రెండో టైటిల్ గెలిచే అవకాశం ఉన్నా.. చివరి బంతికి ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు రవీంద్ర జడేజా. అయితే చివరి ఓవర్లో అప్పటి వరకూ బాగా బౌలింగ్ చేసిన మోహిత్.. చివరి రెండు బంతుల్లో ఎందుకు పరుగులు ఇచ్చాడో గవాస్కర్ వివరించాడు.
అతని ఏకాగ్రతను అనవసరంగా దెబ్బ తీశారంటూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, టీమ్ మేనేజ్‌మెంట్ పై అసహనం వ్యక్తం చేశాడు. బాగా బౌలింగ్ చేస్తున్న సమయంలో డ్రింక్స్ పంపించి మోహిత్ రిథమ్ దెబ్బ తీశారన్నది లిటిల్ మాస్టర్ వాదన. అంతేకాదు ఆ సమయంలో మోహిత్ తో పాండ్యా సుదీర్ఘంగా చర్చించడం కూడా తప్పేనని స్పష్టం చేశాడు.
"అతడు మొదటి 3,4 బంతులను అద్భుతంగా వేశాడు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా అతనికి కొన్ని నీళ్లు పంపించారు. ఓవర్ మధ్యలో అతనికి డ్రింక్స్ పంపించారు. అప్పుడు హార్దిక్ వచ్చి అతనితో మాట్లాడాడు. ఓ బౌలర్ అలాంటి రిథమ్ లో ఉన్నప్పుడు అతడు మానసికంగా కూడా సిద్ధంగా ఉన్నట్లే. ఆ సమయంలో ఎవరూ ఏమీ చెప్పాల్సింది కాదు. దూరం నుంచి చాలా బాలా బౌలింగ్ చేస్తున్నావ్ అని చెబితే సరిపోయేది" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్ తొలి నాలుగు బంతుల్లో కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. చివరి రెండు బంతుల్లో పది పరుగులు అవసరం కావడంతో గుజరాత్ గెలిచినట్లే అని అందరూ భావించారు. కానీ జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు.
"ఆ సమయంలో మోహిత్ దగ్గరికి వెళ్లి అలా మాట్లాడటం సరైన పని కాదు. ఆ తర్వాత హఠాత్తుగా అతడు అటూ ఇటూ చూశాడు. అప్పటి వరకూ అతడు ఏకాగ్రతతో బౌలింగ్ చేశాడు. వాళ్లు దానిని దెబ్బ తీశారు. ఆ తర్వాత అతడు పరుగులు ఇచ్చాడు" అని గవాస్కర్ అన్నాడు.
సంబంధిత కథనం