Jadeja on Dhoni: మహీ భాయ్.. నీకోసం ఏదైనా చేస్తా: జడ్డూ పోస్ట్ వైరల్
Jadeja on Dhoni: మహీ భాయ్.. నీకోసం ఏదైనా చేస్తా అంటూ జడ్డూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో ట్రోఫీతో తాను, ధోనీ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ జడేజా ఈ కామెంట్ చేశాడు.
Jadeja on Dhoni: ఈ ఏడాది ఐపీఎల్ కు ఇంతకుమించిన ముగింపు ఎవరూ కోరుకోరేమో. చివరి బంతికి జడేజా ఫోర్.. తర్వాత అతన్ని భుజాన మోసిన ధోనీ.. నీకోసం ఏదైనా చేస్తా అంటూ జడ్డూ పోస్ట్.. మొత్తానికి రెండు నెలల పాటు ఐపీఎల్ 2023 ఎంతలా అలరించిందో.. అలాంటి ముగింపే ఇచ్చింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమైన వేళ క్రీజులో జడేజా ఉన్నా కూడా.. గుజరాత్ టైటన్సే ఈసారి కూడా కప్పు గెలుస్తారని చాలా మంది భావించారు.
కానీ జడ్డూ మాత్రం తనదైన స్టైల్లో సిక్స్, ఫోర్ కొట్టి అనూహ్య విజయాన్ని సీఎస్కేకు అందించాడు. దీంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీ కూడా ఈ విజయాన్ని వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ విన్నింగ్ షాట్ కొట్టిన జడేజాను భుజానికి ఎత్తుకోవడంతోపాటు తర్వాత అతన్ని ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మరుపురాని ఘటనల్లో ఒకటి అనడంలో సందేహం లేదు.
అయితే ఫైనల్ తర్వాత జడేజా చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఈ ఎమోషన్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. "ఆ ఒకే ఒక్కడు ఎమ్మెస్ ధోనీ కోసమే మేము దీనిని సాధించాం. మహీ భాయ్ మీ కోసం ఏదైనా చేస్తా" అంటూ జడ్డూ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ ట్రోఫీతో తాను, ధోనీ ఉన్న ఫొటోనే కాకుండా మ్యాచ్ ముగియగానే ధోనీ తనను ఎత్తుకున్న ఫొటోను కూడా జడ్డూ షేర్ చేశాడు.
ఇక తన భార్య రివాబా కూడా ఐపీఎల్ ట్రోఫీ పట్టుకున్న ఫొటోను కూడా జడ్డూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ సీజన్ ప్రారంభం నుంచే సీఎస్కే, ధోనీతో జడేజా రిలేషన్‌షిప్ అంతంతమాత్రంగానే ఉందన్న వార్తల నేపథ్యంలో ధోనీపై తనకున్న గౌరవం, ప్రేమను జడ్డూ ఈ పోస్ట్ తో చాటుకున్నాడు.
"నా సొంతగడ్డపై ఐదో టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. సీఎస్కేను సపోర్ట్ చేయడానికి వాళ్లు వచ్చారు. ఈ అభిమానులు అద్భుతం. వాళ్లకు నా శుభాకాంక్షలు. ఈ విజయాన్ని ధోనీకి అంకింతమిస్తున్నాను. ఏది ఏమైనా బ్యాట్ ను బలంగా తిప్పాలని అనుకున్నాను. ఏదైనా జరగొచ్చు. అందుకే నేరుగా బౌలర్ తలపై నుంచి కొట్టాలని నిర్ణయించుకున్నా. మోహిత్ స్లోబాల్స్ వేస్తాడని తెలుసు" అని మ్యాచ్ తర్వాత జడేజా అన్నాడు.
సంబంధిత కథనం