MS Dhoni Tears : చివరి ఓవర్లో ధోనీ టెన్షన్.. టెన్షన్.. గెలిచాక కన్నీళ్లు
IPL 2023 Champions Chennai Super Kings : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన IPL 2023 ఫైనల్‌లో CSK విజయం సాధించింది. ఈ సందర్భంగా MS ధోని రవీంద్ర జడేజాను ఎత్తిన వీడియో వైరల్ అవుతోంది. ధోనీకి కన్నీళ్లు కూడా వచ్చాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ ఎడిషన్ ముగిసింది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ నియమావళి ప్రకారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో ఎవరూ ఊహించని రీతిలో చెన్నై విజయం సాధించడం విశేషం. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెన్నైని గెలిపించి.. హీరోగా మారాడు. ఆఖరి ఓవర్ 6 బంతులు అభిమానులనే కాకుండా ఇరు జట్ల ఆటగాళ్లను సైతం టెన్షన్ లోకి నెట్టేశాయి.
చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 10 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా క్రీజులో ఉన్నాడు. సీఎస్‌కే(CSK)కు విజయం అసాధ్యమని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే చాలా మంది లెక్కలను జడ్డూ తారుమారు చేశాడు. మోహిత్ శర్మ(Mohit Sharma) వేసిన 5వ బంతికి సిక్సర్, చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. దీనికి ముందు ఔట్ అయిన ఎంఎస్ ధోనీ జడ్డూ బ్యాటింగ్ చేస్తుంటే తలకిందకు వేసి.. కళ్లు మూసుకుని గెలవాలని కోరుకున్నాడు. గెలిచిన వెంటనే జడేజాను పైకి లేపి ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. ధోనీకి కన్నీళ్లు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యువ ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. 96 పరుగులు చేసిన సుదర్శన్ ఫైనల్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా 54, శుభ్‌మన్ గిల్ 39, హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశారు. గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది.
లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన చెన్నైకి వర్షం అడ్డు పడింది. 2 గంటల పాటు ఆట నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకు తగ్గట్టుగానే క్రీజులోకి వచ్చిన గైక్వాడ్, కాన్వాయ్ బౌండరీలు, సిక్సర్లతో పరుగులు రాబట్టారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. గైక్వాడ్ 16 బంతుల్లో 26 పరుగులు చేయగా, కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత శివమ్ దూబే 32, అజింక్యా రహానే 27, అంబటి రాయుడు 19, రవీంద్ర జడేజా 15 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.