IPL Final CSK vs GT: చరిత్ర సృష్టించిన చెన్నై - ఐదో ఐపీఎల్ టైటిల్ సొంతం - ఫైనల్‌లో గుజరాత్ ఓటమి
IPL Final CSK vs GT: ఐపీఎల్ విజేతగా చెన్నై నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్లతో అద్భుత విజయాన్ని సాధించి ఐదో టైటిల్ సొంతం చేసుకున్నది.
IPL Final CSK vs GT: సోమవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై అద్భుత పోరాట పఠిమను కనబరిచి ఐపీఎల్ విజేతగా నిలిచింది. గుజరాత్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించిన ధోనీ సేన ఐదోసారి టైటిల్ సొంతం చేసుకున్నది. చివరి ఓవర్‌లో పదమూడు పరుగులు చేయాల్సి ఉండగా లాస్ట్ రెండు బాల్స్‌కు సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి జడేజా చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సాయిసుదర్శన్ ధనాధన్ ఇన్నింగ్స్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. యువ ప్లేయర్ సాయిసుదర్శన్ 96 రన్స్‌తో చెలరేగి గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు. 47 బాల్స్‌లోనే ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 96 రన్స్ చేసిన సాయిసుదర్శన్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అతడితో పాటు ఓపెనర్ వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీతో (39 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 రన్స్) రాణించాడు.
శుభ్‌మన్ గిల్ (20 బాల్స్‌లో ఏడు ఫోర్లతో 39 పరుగులు), హార్ధిక్ పాండ్య (12 బాల్స్‌లో రెండు సిక్సర్లతో 22 రన్స్) బ్యాటింగ్ మెరుపులతో గుజరాత్ 214 రన్స్ చేసింది. చెన్నై ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. చెన్నై ఇన్నింగ్స్ మొదలైన తర్వాత వర్షం కురియడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 15 ఓవర్లలో 171 రన్స్‌గా టార్గెట్ సెట్ చేశారు.
డేవాన్, రుతురాజ్ మెరుపులు…
భారీ స్కోరును ఛేదించడంతో బరిలో దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 70 రన్స్ జోడించారు. కాన్వే ఇరవై ఐదు బాల్స్‌లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో 47 రన్స్ చేయగా, రుతురాజ్ 16 బాల్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 రన్స్ చేశాడు. వారిద్దరూ ఔటైనా చెన్నై జోరు మాత్రం తగ్గలేదు.
రహానే 13 బాల్స్‌లోనే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 రన్స్ చేయగా, రాయుడు ఎనిమిది బాల్స్‌లోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 రన్స్ చేశారు. ఓ వైపు వికెట్లు పడుతోన్న శివమ్ దూబే క్రీజులో పాతుకుపోయాడు.పదమూడో ఓవర్‌లో రాయుడు, ధోనీలను వరుస బంతుల్లో మోహిత్ శర్మ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లో షమీ ఎనిమిదే పరుగులు ఇవ్వడంతో గుజరాత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.
చివరి ఓవర్‌లో పదమూడు పరుగులు అవసరం కాగా తొలి నాలుగు బంతులకు మోహిత్ మూడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో గుజరాత్ గెలుపు ఖాయంగా కనిపించింది. ఐదో బంతికి సిక్స్, ఆరో బాల్‌కు ఫోర్ కొట్టి చెన్నై అభిమానుల్లో జడేజా ఆనందాన్ని నింపాడు. జడేజా ఆరు బాల్స్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 15 రన్స్ చేయగా, శివమ్ దూబే 21 బాల్స్‌లో రెండు సిక్సర్లతో 32 రన్స్‌తో నాటౌట్‌గా మిగిలాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకున్నారు.