Asian Games gold in equestrian: చరిత్ర సృష్టించిన ఇండియా.. ఈక్వెస్ట్రియాన్‌లో గోల్డ్ మెడల్
Asian Games gold in equestrian: ఏషియన్ గేమ్స్ లో ఇండియా చరిత్ర సృష్టించింది. ఈక్వెస్ట్రియాన్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. 41 ఏళ్ల మెడల్ కరువు తీరుస్తూ ఏకంగా స్వర్ణం గెలవడం విశేషం.
Asian Games gold in equestrian: ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా దూసుకెళ్తోంది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 26) తన మూడో గోల్డ్ మెడల్ గెలిచింది. అది కూడా ఈక్వెస్ట్రియాన్ లో కావడం విశేషం. డ్రెస్సేజ్ ఈవెంట్లో ఇండియన్ టీమ్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆటలో ఏకంగా 41 ఏళ్ల కరువుకు తెరదించుతూ ఇండియన్ టీమ్ గోల్డ్ గెలిచింది.
ఏషియన్ గేమ్స్ 2023లో ఇప్పటికే షూటింగ్ (10 మీ. ఎయిర్ రైఫిల్), క్రికెట్ (వుమెన్స్ క్రికెట్)లలో గోల్డ్ మెడల్ రాగా.. తాజాగా ఈక్వెస్ట్రియాన్ గోల్డ్ తో పసిడి పతకాల సంఖ్య మూడుకి చేరింది. అనుష్ అగర్వల, హృదయ్ చెదా, దివ్యకృతి సింగ్, సుదీప్తి హజేలా కలిసి ఈ మెడల్ సాధించారు. వీళ్లు మొత్తం 209.20 పాయింట్లతో టాప్ పోడియం ఫినిష్ సొంతం చేసుకున్నారు.
చివరిసారి 1982 ఏషియాడ్ లో భారత్ కు చెందిన రఘుబీర్ సింగ్ వ్యక్తిగత ఈవెంట్లో గోల్డ్ గెలిచాడు. ఇక డ్రెస్సేజ్ లో 1986లో చివరిసారి బ్రాంజ్ మెడల్ వచ్చింది. తాజా ఈవెంట్లో మొదట మూడోస్థానానికి ఇండియన్ టీమ్ పడిపోయింది. అయితే తర్వాత అద్భుతంగా పుంజుకుంది. అనుష్, అతని గుర్రం ఎట్రో 71.088 పాయింట్లు స్కోర్ చేయడంతో అతడు వ్యక్తిగతంగా రెండోస్థానానికి చేరాడు.
అతనికితోడు మిగతా వాళ్లు కూడా కోలుకోవడంతో ఇండియా గోల్డ్ గెలిచింది. ఈ కాంపిటిషన్ ఏకంగా 10 గంటల పాటు సాగింది. హృదయ్-ఎమరాల్డ్ 69.941, దివ్యకృతి-అడ్రెనలిన్ 68.176, సుదీప్తి-చిన్స్‌కి 66.706 పాయింట్లు సాధించారు.
ఈసారి ఏషియాడ్ లో 655 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన ఇండియా.. 100కుపైగా మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి రోజు నుంచే పతకాల వేట మొదలుపెట్టింది. తొలి రోజు 5, రెండో రోజు 6 మెడల్స్ గెలిచింది.