Asia Cup 2022: పాకిస్థాన్‌నే కాదు అన్ని టీమ్స్‌ను ఇండియా ఓడిస్తుంది: స్టైరిస్‌-asia cup 2022 will be dominated by india says scott styris ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2022: పాకిస్థాన్‌నే కాదు అన్ని టీమ్స్‌ను ఇండియా ఓడిస్తుంది: స్టైరిస్‌

Asia Cup 2022: పాకిస్థాన్‌నే కాదు అన్ని టీమ్స్‌ను ఇండియా ఓడిస్తుంది: స్టైరిస్‌

Hari Prasad S HT Telugu
Aug 25, 2022 02:20 PM IST

Asia Cup 2022: ఆసియాకప్‌లో పాకిస్థాన్‌నే కాదు.. అన్ని టీమ్స్‌ను మట్టి కరిపించే సామర్థ్యం టీమిండియాకు ఉందని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్‌ అన్నాడు. శనివారం (ఆగస్ట్‌ 27) నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ఆసియా కప్ లో ఆసక్తి రేపుతున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
ఆసియా కప్ లో ఆసక్తి రేపుతున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ (AFP)

Asia Cup 2022: ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎంతగానో ఆసక్తి రేపుతోంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఈ రెండు టీమ్స్‌ ఆడుతున్న తొలి మ్యాచ్‌ కావడం, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు రావడంతో ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో అని రెండు దేశాల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్‌ మాత్రం ఇండియాకే ఓటేశాడు.

అంతేకాదు ఆసియా కప్‌ గెలవాలంటే ఇండియా ఎలా ఆడాలి? గతేడాది వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఓడిపోవడం వెనుక కారణాలను కూడా అతడు విశ్లేషించాడు. ఆ వరల్డ్‌కప్‌లో తమ ప్లేయర్స్‌కు సరిపోయే స్టైల్‌లో ఆడలేకపోవడం వల్లే ఇండియా ఓడిపోయిందని స్టైరిస్‌ అభిప్రాయపడ్డాడు. ప్రతి టీమ్‌పై దూకుడుగా ఆడాలని కూడా చెప్పాడు.

"మనందరికీ తెలుసు ఇండియా బలమైన టీ20 లీగ్‌ను కూడా కలిగి ఉంది. ప్లేయర్స్‌కు సరిపడే స్టైల్‌, ఆ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆడే సామర్థ్యమే ముఖ్యమని నేను భావిస్తున్నాను. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఈ ట్రిక్‌నే మిస్సయింది. రెండు ఓటముల తర్వాతే వాళ్లు ప్రత్యర్థిపై విరుచుకుపడుతూ ఆడారు. ఆసియా కప్‌లోనూ ఇండియా అదే చేయాలి. ప్రత్యర్థులపై విరుచుకుపడాలి. వాళ్లకు ఆ సామర్థ్యం ఉంది. పాకిస్థాన్‌ సహా అన్ని టీమ్స్‌ను మట్టి కరిపించే సత్తా వాళ్లకు ఉందని నేను భావిస్తున్నా" అని స్టైరిస్‌ అన్నాడు.

అయితే ఎలా ఆడాలో తెలియని అయోమయంలో వాళ్లు బరిలోకి దిగితే మాత్రం అది సాధ్యం కాదని స్టైరిస్‌ స్పష్టం చేశాడు. ఈ విషయంలో పాకిస్థాన్‌ కాస్త ముందు ఉంటుందని చెప్పాడు. పాకిస్థాన్‌ టీ20 టీమ్‌ బాగుందని, అయితే ఇండియాకు కూడా అలాంటి టీమే ఉందని అన్నాడు. అందువల్ల టీమ్స్‌ బలంగా ఉండటమన్నది మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతుందని తాను అనుకోవడం లేదని స్టైరిస్‌ చెప్పాడు.

ఆసియాకప్‌లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 28న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌లో జరగనుంది. గతేడాది కూడా ఇదే వేదికలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్థాన్‌ గెలిచింది. ఈసారి ఇటు ఇండియాలో బుమ్రా, అటు పాకిస్థాన్‌లో షహీన్‌ అఫ్రిది లేకపోవడం రెండు టీమ్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం