Ind vs Pak: ఇండియా, పాక్‌ మ్యాచ్‌ హౌజ్‌ఫుల్‌.. ఆ 4 వేల మంది నిల్చొని చూడాల్సిందే-ind vs pak match tickets for t20 world cup sold out in just five minutes ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak: ఇండియా, పాక్‌ మ్యాచ్‌ హౌజ్‌ఫుల్‌.. ఆ 4 వేల మంది నిల్చొని చూడాల్సిందే

Ind vs Pak: ఇండియా, పాక్‌ మ్యాచ్‌ హౌజ్‌ఫుల్‌.. ఆ 4 వేల మంది నిల్చొని చూడాల్సిందే

Hari Prasad S HT Telugu
Aug 25, 2022 12:05 PM IST

Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ టికెట్లన్నీ కేవలం ఐదు నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ ఆర్గనైజర్లు ఎన్నడూ లేని విధంగా స్టాండింగ్ రూమ్‌ ఓన్లీ టికెట్లంటూ కొత్తగా 4 వేల టికెట్లు రిలీజ్‌ చేశారు.

టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వేదిక కానున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్
టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వేదిక కానున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (twitter)

Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది అద్దం పట్టే విషయం. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ రెండు టీమ్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఆర్గనైజర్స్‌ టికెట్లు రిలీజ్‌ చేయగా.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో అన్నీ అమ్ముడైపోయాయి. ఎంసీజీలో 90 వేల సీట్లు ఉండటం విశేషం.

ఇన్ని టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోవడంతో ఇక చేసేది లేక ఆర్గనైజర్లు స్టాండింగ్‌ రూమ్‌ ఓన్లీ టికెట్లంటూ రిలీజ్ చేశారు. ఇలా మరో 4 వేల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టికెట్లు కొన్న వాళ్లకు కూర్చోడానికి ప్లేస్‌ ఉండదు. అంటే మ్యాచ్‌ మొత్తం వీళ్లు తాము నిల్చొన్న చోటు నుంచే చూడాలి. లక్ష సీట్ల కెపాసిటీ ఉన్న మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడే సమయాల్లో 90 వేల సీట్లే అందుబాటులో ఉంటాయి.

అయితే ఇలా అదనపు టికెట్లు రిలీజ్‌ చేసి సాధ్యమైనంత ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఈ మ్యాచ్‌ చూసేలా ఏర్పాట్లు చేసినట్లు ఆర్గనైజర్లు చెబుతున్నారు. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే తలపడుతున్నాయి. అందులోనూ వరల్డ్‌కప్‌లాంటి మెగా ఈవెంట్‌లో ఈ దాయాదుల మ్యాచ్‌కు డిమాండ్‌ మరింత ఎక్కువగా ఉంటుంది.

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో చివరిసారి ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 10 వికెట్లతో గెలిచింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో ఇండియాను పాక్‌ ఓడించడం ఇదే తొలిసారి. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ కంటే ముందే ఆసియాకప్‌లో ఈ నెల 28న ఇండియా, పాకిస్థాన్‌ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌కు దుబాయ్‌ వేదిక కానుంది. ఆసియాకప్‌లోనే ఈ రెండు టీమ్స్‌ మూడుసార్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే అది తొలి రౌండ్‌తోపాటు సూపర్‌ 4 మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం