Asia Cup Qualifiers: ఆసియాకప్‌కు క్వాలిఫై అయిన హాంకాంగ్.. ఇండియా, పాక్‌లతో ఢీ
Asia Cup Qualifiers: ఆసియాకప్ ప్రధాన టోర్నీకి హాంకాంగ్ క్వాలిఫై అయింది. దీంతో ఆ టీమ్ గ్రూప్ ఎలో ఉన్న ఇండియా, పాకిస్థాన్ టీమ్‌లతో ఆడనుంది.
Asia Cup Qualifiers: ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌లతో ఆడబోయే ఆ మూడో టీమేదో తేలిపోయింది. ఈ స్థానాన్ని హాంకాంగ్ సొంతం చేసుకుంది. నాలుగు రోజుల పాటు జరిగిన క్వాలిఫయర్స్ మ్యాచ్‌లలో హాంకాంగ్ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూఏఈని మట్టికరిపించిన ఆ టీమ్.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది.
క్వాలిఫయర్స్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ హాంకాంగ్ విజయం సాధించడం విశేషం. యూఏఈతో మ్యాచ్‌లో హాంకాంగ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. నిజాఖత్ ఖాన్ కెప్టెన్సీలోని హాంకాంగ్ టీమ్.. వచ్చే బుధవారం (ఆగస్ట్ 31) దుబాయ్‌లో ఇండియాతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న షార్జాలో పాకిస్థాన్‌తో మరో మ్యాచ్‌లో తలపడనుంది.
క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్ దూకుడు అడ్డు లేకుండా పోయింది. తొలి మ్యాచ్‌లో సింగపూర్‌పై 8 రన్స్ తేడాతో గెలిచింది. ఆ తర్వాత కువైట్‌పై 8 వికెట్లతో విజయం సాధించింది. అటు కువైట్ కూడా రెండు మ్యాచ్‌లలో గెలవడంతో బుధవారం యూఏఈతో జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్ హోస్ట్ టీమ్ యూఏఈని 8 వికెట్లతో మట్టి కరిపించింది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో యూఏఈ గెలిచి ఉంటే.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో కువైట్ అర్హత సాధించేది. అయితే యూఏఈ నిర్దేశించిన 148 రన్స్ టార్గెట్‌ను మరో ఓవర్ మిగిలి ఉండగానే హాంకాంగ్ చేజ్ చేసింది. యాసిమ్ ముర్తుజా హాఫ్ సెంచరీతోపాటు బాబర్ హయత్ కేవలం 26 బాల్స్‌లోనే 38 రన్స్ చేయడంతో ఆ టీమ్ సులువుగా టార్గెట్ చేజ్ చేసింది.
సంబంధిత కథనం