Shani mahadasha: మానవుని జీవితంపై గ్రహ ప్రభావాలు ఉంటాయని ఆ గ్రహ ప్రభావాన్ని బట్టి వారికి శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యశాస్త్రం తెలియచేస్తోంది.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం జాతక చక్ర విశ్లేషణలో ముఖ్యమైనది పుట్టినతేది, సమయం, ప్రాంతము వివరాలు. నవాంశ ఎంతటి ప్రాధాన్యమైనవో, గోచారపరంగా చెప్పేటటువంటి గోచారఫలితాలు ఎంతటి ప్రాధాన్యమైనవో తాము పుట్టిన నక్షత్రాల ద్వారా ఏర్పడేటటువంటి మహాదశలు కూడా జ్యోతిష్యశాస్త్రంలో ప్రాధాన్యమైనవని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మానవుడు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్ర అధిపతిని బట్టి అతని జీవితంలో మహాదశ ప్రారంభమవుతుంది. అలా అతని నూరేళ్ళ జీవితాన్ని చూసినపుడు నూరేళ్ళలో రవి, చంద్ర, కుజ, రాహువు, గురు, శని, బుధ, శుక్ర, కేతువు వంటి మహాదశలు అన్నీ ఈ నూరేళ్ళలో వస్తాయని చిలకమర్తి తెలిపారు. 27 నక్షత్రాలలో ప్రతీ నక్షత్రానికి వారి నూరేళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో శని మహాదశ వస్తుందని అయితే మృగశిర, చిత్త, ధనిష్ట, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర వంటి నక్షత్రాలలో 50ఏళ్ళ లోపే ఖచ్చితంగా శని మహర్దశ వస్తుందని చిలకమర్తి తెలిపారు.
శని మహర్దశ మంచి లేదా చెడు అనేది వారి జాతకచక్రం, గోచారఫలితాలమీద ఆధారపడి ఉంటుందని చిలకమర్తి తెలిపారు. జాతకచక్రంలో శని శుభ స్థానాలు, ఉచ్చక్షేత్రాలలో ఉన్నట్లయితే అటువంటి వారికి శని మహాదశ ఉంటుంది. జాతకచక్రంలో శని నీచస్థానాలలో, అశుభ క్షేత్రాలలో ఉంటే వారికి శని మహాదశ ఇబ్బందులకు గురి చేస్తుందని చిలకమర్తి తెలిపారు. శని అనుగ్రహం పొందడం కోసం ఈ క్రింది విషయాలను పాటించినట్లయితే వారికి శని మహాదశ యోగిస్తుందని చిలకమర్తి తెలిపారు.
1. నిత్యము గురు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం.
2. నలదమయంతి కథను చదవడం.
3. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం.
4. మందపల్లి, తిరునల్లార్, శనిసింగనాపూర్ వంటి క్షేత్రాలను దర్శించడం.
5. వేంకటేశ్వర స్వామిని పూజించడం వంటి కార్యక్రమాలను చేయడం వలన
శని మహాదశలో ఉన్నటువంటి దోషములు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.