Lunar eclipse: చంద్రగ్రహణం సమయం.. గ్రహణం వేళ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Lunar eclipse: నేడే చంద్రగ్రహణం. ఈ ఏడాది వచ్చిన మొదటి చంద్రగ్రహణం ఇదే. గ్రహణం వేళ కొన్ని ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి ఆచారాలు పాటించాలనే విషయం తెలుసుకుందాం.
Lunar eclipse: నేడే చంద్రగ్రహణం. అలాగే రంగుల పండుగ హోలీ కూడా ఈరోజు జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ ఏడాది ఏర్పడుతున్న మొదటి చంద్రగ్రహణం భారత్ లో కనిపించదు. అందువల్ల హోలీ మీద చంద్రగ్రహణం ప్రభావం ఏమాత్రం ఉండదని పండితులు చెప్తున్నారు.
గ్రహణ సమయం ఉదయం 10:23 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 3.01 గంటల వరకు ఉంటుంది. చంద్రుడు భూమి బయట అంచుగుండా ప్రయాణించినప్పుడు పెనుంబ్రల్ (ఛాయా బింబం) చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం వ్యవధి మొత్తం 4 గంటల 36 నిమిషాలు. పెనుంబ్రల్ చంద్రగ్రహణం అమెరికా, యూరప్‌లో ఎక్కువ భాగం, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర/తూర్పు ఆసియా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికాలో కనిపిస్తుంది. ఐర్లాండ్, బెల్జియం, స్పెయిన్, ఇంగ్లండ్, దక్షిణ నార్వే, ఇటలీ, పోర్చుగల్, రష్యా, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ , ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది. భారత్ లో కనిపించకపోవడం వల్ల సూతక్ కాలం ఉండదు. ఈ ఏడాది చంద్రగ్రహణం కన్యారాశిలో జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గ్రహణం ముగిసిన తర్వాత చేయాల్సిన పనులు
గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేపట్టడం వల్ల మంచి గ్రహణ దోషం తొలగిపోతుంది. ఇంటి మీద ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు, వ్యాపార సంస్థలు, దుకాణం వంటి వాటిని గంగాజలంతో శుభ్రపరచాలి. రాగి పాత్రలు, గోధుమలు, శనగలు, ఉప్పు, బెల్లం, నల్ల నువ్వులు వంటి వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పేదలకు ఆహారం పంచి పెట్టాలి.
గ్రహణ సమయంలో ఎక్కువగా దైవనామ స్మరణలో ఉండాలి. చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటే చంద్రబీజ మంత్రాన్ని పఠించాలి. జాతకంలో చంద్ర దోషంతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు చంద్రగ్రహణం రోజున రుద్రాక్ష జపమాలతో చంద్రుని బీజమంత్రాలను జపించడం వల్ల దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. పవిత్ర నదిలో స్నానమాచరించాలి. తమ శక్తి మేరకు డబ్బులు, వస్త్రాలు వంటి దానం చేయడం మంచిది.
గ్రహణం సమయంలో చేయకూడని పనులు
గ్రహణం సమయంలో ఆహారం వండడం, జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం వంటివి పొరపాటున కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో నిద్ర పోకూడదు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు. గ్రహణకాలంలో నిద్రించడం వల్ల రోగ బాధలు పీడిస్తాయని పండితులు చెబుతారు. ఈ సమయంలో ఆహారం సేవించడం కూడా మంచిది కాదు.
గ్రహణ ప్రభావం తగ్గించుకోవడం కోసం తులసి ఆకులను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల గ్రహణానికి సంబంధించి ఎటువంటి ఫలితాలు మీ మీద ప్రభావం చూపించవు. అలాగే దర్భ గడ్డిని ఆహారంలో చేర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రహణం నీడ పడి ఆహారం విషపూరితం కాకుండా కాపాడుతుందని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తులు నుంచి రక్షిస్తుంది.
గ్రహణ సమయంలో దుష్టశక్తుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఇంటి ముందు కట్టిన దిష్టి గుమ్మడి కాయలు, నిమ్మకాయలు వంటివి మార్చుకుంటే మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి అవసరమైన వారికి నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల రాహువు కేతువు, ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి.