Significance of Amla : కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు ఇంత ప్రాముఖ్యతను ఇస్తారో తెలుసా?-do you know why amla is given so much importance in kartika masam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Significance Of Amla : కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు ఇంత ప్రాముఖ్యతను ఇస్తారో తెలుసా?

Significance of Amla : కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు ఇంత ప్రాముఖ్యతను ఇస్తారో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 02, 2022 07:49 AM IST

Significance of Amla in Karthika Masam : కార్తీకమాసంలో తులసితోపాటు.. ఉసిరికి అంతే ప్రాధన్యత ఇస్తారు. అసలు ఉసిరికి పూజలో ఎందుకు ఇంత ముఖ్యపాత్ర ఉంది. కార్తీకమాసానికి ఉసిరికి సంబంధం ఏంటి అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా మొదలైందా? అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీకమాసంలో ఉసిరిని ఇందుకే ఉపయోగిస్తారు
కార్తీకమాసంలో ఉసిరిని ఇందుకే ఉపయోగిస్తారు

Significance of Amla in Karthika Masam : ప్రతి పూజ, ప్రతి నమ్మకం వెనుక మనకి మేలు చేసే ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో ఉసిరిని పూజించడం వెనుక కూడా మనకు మేలు చేసే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు మనకి చేకూరాలనే పెద్దలు ఆయా సందర్భాల్లో.. ఆయా మొక్కలతో, ఆచారాలతో.. మనకు దేవుని ఆశీస్సులతో పాటు.. ఆరోగ్య ప్రయోజనాలు పొందేలా డిజైన్ చేశారు. ఇంతకీ ఉసిరితో పొందే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీకమాసం అనగానే మనకు గుర్తొచ్చేవి కార్తీక స్నానం, శివారాధన, తులసిపూజ వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి. అయితే పూజల విషయాలనికొస్తే.. కార్తీక మాసంలో తులసికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ఉసిరి అంతే ప్రాముఖ్యత ఉంది. సరిగా చెప్పాలంటే పూజలో తులసి కంటే ఎక్కువ ఉసిరి కనిపిస్తూ ఉంటుంది. ఉసిరి కాయతో వత్తిని వెలిగించడం.. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం.. ఉసిరి ఆకులతో పూజలు చేయడం వంటివన్నీ చూస్తూ ఉంటాము. పర్యావరణానికి మేలు చేసే చెట్లలో ఉసిరి కూడా ఒకటి. అందుకే దీనికి కార్తీక మాసంలో ప్రాముఖ్యతను ఇచ్చారు.

ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుస్తారు. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు ధాత్రి సహిత లక్ష్మీనారాయస్వామినే నమః అంటారు. దీనివెనుక ఓ కథ కూడా ఉందని భక్తులు నమ్ముతారు. క్షీరసాగర మథనం జరిగిన సమయంలో అమృతం ఉద్భవించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో దేవదానవుల మధ్య జరిగిన ఘర్షణలో ఆ అమృతంలోని కొన్ని చుక్కలు నేల మీద పడి ఉసిరి చెట్టుగా మారిందని నమ్ముతారు. అందుకే సకల వ్యాధులనూ నివారించే కాయగా ఉసిరిని చూస్తారు. ఆయుర్వేదంలో కూడా ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంది.

ఇన్ని ఔషద గుణాలు కలిగిన ఈ ఉసిరికి కార్తీక మాసంలో మాత్రమే ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారంటే.. దానికి బోలేడు కారణాలున్నాయి. కార్తీక మాసం చలికాలం ప్రారంభంలో వస్తుంది. ఆ సమయంలో దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటాము. వాటికి చెక్ పెట్టేందుకు ఉసిరి డైట్​లో యాడ్ చేసుకోవచ్చు. ఉసిరిలోని విటమిన్ సి దగ్గు, జలుబులను నివారిస్తే.. దానిలో పీచు పదార్థాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

ఆయుర్వేదం ప్రకారం ఉసిరిలోని ప్రతి భాగము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆఖరికి వేళ్లతో సహా. అందుకే ఉసిరి చెట్టు మొదలు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేస్తారు. పైగా ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తియ్యగా మారుతుందని పెద్దలు చెప్తారు. వేప చెట్ల నుంచి వచ్చే గాలి ఎంత శ్రేష్టమైనదో.. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి కూడా అంతే శ్రేష్టమైనదిగా భావిస్తారు. వర్షాకాలంలో బలాన్ని పుంజుకున్న ఉసిరి.. చలికాలంలో పచ్చని, దృఢమైన కాండంతో.. మంచిగా కాపు కాస్తూ.. ఉసిరి కాయలను అందిస్తుంది. కార్తీక మాసం వచ్చేసరికి అన్ని ఆయుర్వేద గుణాలను తనలో నింపుకుని మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం