Karthika Masam 2022 : కార్తీకమాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే.. ప్రతి పూజ ఓ ఫలమే..
Significance of Karthika Masam : కార్తీక మాసము శివకేశవులకు భేదము లేనటువంటి మాసము. శివారాధనకు, విష్ణు ఆరాధనకు కార్తీక మాసము కన్నా ఉత్తమమైన మాసము లేదు. మరి ఈ మాసములో ఏయేరోజు ఏమి ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Significance of Karthika Masam : ఏ వ్యక్తి అయినా తన జీవితములో తెలిసిగాని తెలియక గాని చేసిన పాపాలు పోగొట్టుకుని, పుణ్యమును సంపాదించుకోవడానికి.. కార్తీక మాసమును మించినటువంటి మాసము లేదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని భక్తి మార్గమునందు, ముక్తి మార్గమునందు తీసుకుని వెళ్లడానికి కార్తీక మాసములో ప్రతీ రోజుకి ఒక ప్రాధాన్యత ఉందని వెల్లడించారు.
కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కార్తీక స్నానానికి, కార్తీక వ్రతాన్ని ఆచరించేటటువంటి రోజుగా కార్తీక పురాణము తెలిపినది. కార్తీక శుక్ల పక్ష విదియను యమ ద్వితీయగా, గజనీ హస్త భోజనముగా చెప్తారు. ఆ రోజు ప్రతి సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లి ఆమె వండిన ఆహారాన్ని తిని ఆమెకు ఇష్టమైనటువంటి వస్త్రములు, ప్రీతికరమైన వస్తువులు అందిస్తారు. కార్తీక శుక్ల పక్ష తదియనాడు అమ్మవారిని పూజించడం, అమ్మవారి ఆలయాలను దర్శించడం చేయాలి. కార్తీక శుక్ల పక్ష చవితి నాగుల చవితిగా నాగ దేవత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం చేయాలి. కార్తీక శుక్ల పక్ష పంచమి కార్తీక పంచమిని జ్ఞాన పంచమి అంటారు. ఆరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుందని శాస్త్రము చెప్తుంది. కార్తీకమాస శుక్ల పక్ష షష్ఠి సంతాన ప్రాప్తి కోసం ఆరోజు అమ్మవారిని పూజించడం, అమ్మవారిని ఆరాధించి ఎర్రటి వస్త్రమును సమర్పిస్తారు. దానము చేయడం విశేషం.
కార్తీక మాస శుక్ల పక్ష సప్తమి రోజు సూర్యారాధనకు ఉత్తమమైన రోజు. ఆరోజు ఆదిత్య హృదయము పారాయణ చేయడం, పుణ్యనదియందు స్నానమాచరించుట వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాస శుక్ల పక్ష అష్టమి రోజు గో పూజ చేయడం శుభఫలితాలను ఇస్తాయి. దీనిని గోపాష్టమి అని అంటారు. కార్తీక మాస శుక్ల పక్ష నవమి రోజు మహావిష్ణువును పూజించడం రామనామ స్మరణ చేయడం చాలా విశేషం. కార్తీక దశమి ఈరోజు కార్తీక దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ మూడు రోజులు మహావిష్ణువును పూజించి విష్ణు సహస్ర నామ పారాయణం చేసిన వారికి విష్ణు మూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కార్తీక శుక్ల పక్ష ఏకాదశి బోధన ఏకాదశి రోజు మహా విష్ణువును పూజించిన వారికి సద్గతులు కలుగుతాయి.
కార్తీక మాస ద్వాదశి రోజు పాల సముద్రములో దేవతలు దానవులు చిలకినటువంటి ద్వాదశి రోజు సాయంత్రం ఉసిరికొమ్మను తులసినమొక్క వద్ద పెట్టి తులసిని, లక్ష్మీదేవిని, ఉసిరిచెట్టును మహావిష్ణువుగా భావించి సాయంత్రం పూట క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును చేస్తారు. ఈ వ్రతమును ఆచరించిన వారికి సర్వపాపహరణం అవుతుంది. బృందావన ద్వాదశి బృందావనమునందు దీపాలను వెలిగిస్తారు. కార్తీక శుక్ల పక్ష త్రయోదశి శివారాధనకు విశేషించి, ప్రదోషకాలముందు చేసే శివారాధనకు విశేషమైన పుణ్యఫలం ఉన్నది. ఆరోజు సాలగ్రామాన్ని దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. కార్తీక మాస చతుర్దశి శివారాధనకు చాలా విశేషం. విశేషించి ప్రదోషకాలములో చేసే శివారాధన, దీపారాధన, దానములకు కొన్ని కోట్ల రెట్ల ఫలితాలుంటాయి. కార్తీక శుక్ల పక్ష పూర్ణిమ కార్తీక పౌర్ణమిరోజు చేసే నదీ స్నానానికి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనానికి, ఆరోజు ఆచరించే సత్యనారాయణస్వామి వ్రతానికి ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి. కార్తీక బహుళ పాడ్యమి దుర్గాదేవి ఆరాధనకు, ఆకుకూరల దానములకు ప్రసిద్ధి. ఆరోజు చేసే దానముల వల్ల పుణ్య ఫలము లభిస్తుంది.
కార్తీక బహుళ విదియ కార్తీక వన భోజనాలకు విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ తదియ దుర్గాదేవిని ఆరాధించటానికి చాలా విశేషమైన రోజు. కార్తీక బహుళ చవితి రోజు విఘ్నేశ్వరుని పూజించినటువంటి వారికి ఉన్నటువంటి కష్టములు అన్ని తొలగి పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. కార్తీక బహుళ పంచమి రోజు ఆచరించేటువంటి నదీ స్నానాలకు పుణ్య ఫలితముంటుంది. కార్తీక బహుళ షష్ఠి గ్రామ దేవత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక బహుళ సప్తమి జిల్లేడు పూల దండలతో శివారాధన చేయడానికి విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ అష్టమి రోజు కాలభైరవున్ని ఆరాధించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. కార్తీక బహుళ నవమి రోజు శ్రీరామ నామ స్మరణకు, విష్ణు మూర్తి ఆరాధనకు విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ దశమి రోజు మహావిష్ణువును ఆరాధించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక బహుళ ఏకాదశి దీనిని మతత్ర ఏకాదశి అంటారు. రోజు విష్ణు ఆలయంలో దీపారాధన చేసి ఏకాదశి ఉపవాసం ఆచరించినవారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.
కార్తీక బహుళ ద్వాదశి దీప దానములకు, అన్న దానము వంటివి ఆచరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక బహుళ త్రయోదశి రోజు నవగ్రహ ఆరాధన చేసినటట్లయితే గ్రహ దోషములు తొలగుతాయ. కార్తీక బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకోవడం, ప్రదోషకాలముందు శివారాధన చేసుకోవడం వలన అపమృత్యు దోషాలు, భయాలు తొలగుతాయి. కార్తీక అమావాస్య రోజు చేసే శివరాధనకు పితృ దేవతల పేరుతో పెట్టే అన్న దానములకు పెద్దలకు నరక బాధలు తొలగుతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం