Varalakshmi vratam: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి
Varalakshmi vratam: ఆగస్ట్ 16వ తేదీ వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం ఆచరించుకోవచ్చా? ఎన్ని నెలల్లోపు గర్భిణీలు ఈ వ్రతం చేసుకోవచ్చు? ఎలా ఆచరించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Varalakshmi vratam: కొత్తగా పెళ్ళైన దంపతలు సౌభాగ్యంగా ఉండాలని, భర్తతో అన్యోన్యంగా కలహాలు లేని కాపురం చేసుకోవాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజు ప్రత్యేకమైన రోజు. వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సంపద, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.
ఈ వ్రతం సందడి అన్నీ ఇళ్ళలోను కనిపిస్తుంది. ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటతో తప్పనిసరిగా ఈ పూజ చేయిస్తారు. కానీ గర్భవతి అయితే మాత్రం పూజ చేసుకోకూడదని అంటారు. గర్భం ధరించిన స్త్రీలు వరలక్ష్మీ వ్రతం, పూజలు చేసుకోకూడదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. గర్భం దాల్చడం వల్ల వ్రతం చేసుకోకుండా చాలా మంది ఆగిపోతారు. కానీ పండితులు మాత్రం గర్భిణీ స్త్రీలు కూడా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చని చెబుతున్నారు.
ఆగస్ట్ 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. గర్భం ధరించిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఐదు నెలలలోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి. ఆరో నెల వస్తే మాత్రం చేసుకోకూడదు. శ్రావణ మాసంలో ఐదు నెలలు లోపల ఉన్న గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఆచరించవచ్చు. అలాగే కొబ్బరికాయ, గుమ్మడి కాయ కొట్టకూడదు. అలాగే క్షేత్ర దర్శనం చేసుకోకపోవడం ఉత్తమం.
ఈ నియమం వెనుక కారణం ఏమిటంటే
పూర్వం ఆలయాలు కొండలు, గుట్టల మీద ఉండేవి. గర్భిణీ స్త్రీలు వాటిని ఎక్కడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. అది మాత్రమే కాకుండా భక్తుల రద్దీ ఆలయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే పూజల విషయంలో కొన్ని నియమాలు విధించారు. అలాగే పూజ చేయాలంటే నేల మీద ఎక్కువ సేపు కూర్చోవాలి. దీని వల్ల నడుము నొప్పి, కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గర్భవతిగా ఉన్న మహిళ ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పూర్వం పెద్దలు ఈ నియమాలు తీసుకొచ్చారు.
పూజ చేయకపోయినప్పటికీ వరలక్ష్మీ వ్రతాన్ని చూడటం, కథ వినడం వంటివి చేసుకోవచ్చు. తేలికపాటి పూజలు చేసుకోవచ్చు. శారీరక శ్రమతో ఉండేవి చేయకపోవడం ఉత్తమం. పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం కూడా చేయకూడదు. ఇది శారీరకంగా అలసటను ఇస్తుంది. అందుకే దైవ నామ స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతత ఉంటుంది.
తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్ నడుస్తోంది. ఇంట్లో ఏదైనా పూజ, ఫంక్షన్ అంటే చాలు అభిరుచికి తగినట్టుగా ప్రత్యేకంగా రిటర్న్ గిఫ్ట్ లు తయారు చేసి ఇస్తున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళు అటువంటి పోకడలకు పోవద్దని పండితులు సూచిస్తున్నారు.
పవిత్రమైన వ్రతం చేసుకుంటూ ఇటువంటి ఆధునిక పద్ధతులు అనుసరించడం మంచిది కాదని చెబుతున్నారు. తాంబూలం ఇవ్వడం అనేది ఒక దైవిక ఆశీర్వాదం కోరుతూ చేసే పని. అందుకే తాంబూలం సరైన పద్ధతిలో ఇవ్వాలని సూచిస్తున్నారు. తాంబూలంలో రెండు ఆకులు, రెండు వక్కలు, రెండు పండ్లు(కవల పండ్లు పెట్టకూడదు), ఒక జాకెట్ ముక్క, ఒక రూపాయి కాయిన్, పసుపు, కుంకుమ ఇవ్వడం మంచిది. అంతే కానీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం సంప్రదాయం కాదు. స్త్రీలు తమ భర్త సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం వరలక్ష్మీ వ్రతం. అటువంటి పవిత్రమైన వ్రతం సంప్రదాయ బద్ధంగా చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.