Mangala gowri vratam: శ్రావణ మాసంలో చేసుకునే మంగళ గౌరి వ్రతం విశిష్టత ఏంటి? ఎలా చేసుకోవాలి?-what is the special of mangala gowri vratam performed in the month of sravan masam how to do it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mangala Gowri Vratam: శ్రావణ మాసంలో చేసుకునే మంగళ గౌరి వ్రతం విశిష్టత ఏంటి? ఎలా చేసుకోవాలి?

Mangala gowri vratam: శ్రావణ మాసంలో చేసుకునే మంగళ గౌరి వ్రతం విశిష్టత ఏంటి? ఎలా చేసుకోవాలి?

HT Telugu Desk HT Telugu
Aug 05, 2024 09:30 AM IST

Mangala gowri vratam: శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఎలా అచ్చరించాలో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం

Mangala gowri vratam: తెలుగు మాసాల్లో ఎంతో శుభ‌ప్ర‌ద‌మైన‌ది శ్రావణ మాసమ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అలాగే జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇలా అనేక పర్వదినాలు, పండగలతో హిందువులు ఈ నెల‌లో ఆధ్యాత్మిక జీవ‌నం సాగిస్తార‌ని తెలిపారు.

బంగారం, వెండితోపాటు వ‌స్త్రాలు కొనుగోలు చేయ‌డానికి ఇది శుభ‌ప్ర‌ద‌మైన మాసమ‌ని చెప్పారు. పెళ్లి కాని వారు మంచి భ‌ర్త కోసం నోములు, వ్రతాలు చేయడానికి ఈ నెల‌లోనే సన్నద్ధమవుతారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు రాసి కుంకుమ, బియ్యం పిండితో పెట్టిన ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇళ్ళు సందడిగా, ఒకవిధమైన లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంద‌ని చిల‌కమ‌ర్తి తెలిపారు.

శ్రావణమాసంలో వచ్చే నాలుగు సోమవారాలు శివభక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజచేస్తే అయిదవతనం కలకాలం నిలుస్తుందని భక్తుల నమ్మకమ‌ని ఆధ్యాత్మిక వేత్త‌ చిల‌క‌మ‌ర్తి తెలిపారు. శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి, నారద మునీంద్రుడు సావిత్రీ దేవికి ఉపదేశించినది మంగళగౌరీ వ్రతకథ, పూజావిధానం.

మంగళగౌరీ వ్రత విధానం

మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండ‌దు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు అలరారుతుంటారు. అందుకే పెళ్ళయిన ప్రతి మహిళ శ్రావణ మంగళవారాల నోము నోచుకోవడం అనాదిగా వస్తోంది. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆవునేతిలో మంగళగౌరి ఉంటుంది. అందుకే వాటినన్నింటినీ ఈ వ్రతానికి ఇవన్నీ తప్పకుండా వాడతారు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలలో చేస్తారు.

కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో మంగళగౌరి వ్రతాన్ని చేయిస్తారు. ఈ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి మంగళగౌరి వ్రతానికి కావలసిన పూలు, పళ్ళు, శనగలు (నానపెట్టినవి), పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు మొదలైన సామగ్రిని సమకూర్చుకోవాలి. పసుపురాసిన దారానికి పువ్వులు, మాచుపత్రికానీ, దమనంకానీ కట్టి తోరణాలు తయారుచేస్తారు. వాటిని పూజచేసేటప్పుడు గౌరీదేవి మీద పెట్టి పూజ అయిన తర్వాత ఒకటి గౌరీదేవికి ఉంచి, రెండు తీసి ఒకటి ముత్తైదువుకు వాయనంగా ఇస్తారు.

వాయ‌నం ఇచ్చినప్పుడు సౌభాగ్య ప్రదాయిని శ్రావణ గౌరి 'సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ॥ శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతేస ॥ అని అమ్మ‌వారిని ఆరాదిస్తారు. భారతీయ సనాతన సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యముంది. నూతన వధువులు సౌభాగ్య సిద్ధి కోసం ఈ మాసంలోనే అమ్మలగన్న అమ్మ పెన్నిధులిచ్చెడి కల్పవల్లి అయిన మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాల్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

గౌరీదేవిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని పెళ్లికాని కన్యలు విశ్వసిస్తారు. పాతివ్రత్య శక్తి కలిగినది పార్వతీదేవి. పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం పొందిన అర్ధనారీశ్వరి. శ్రావణ మంగళవారం గౌరీపూజ చేసేవారికి సౌభాగ్యం కలుగుతుందనీ ఇష్టకామ్యార్ధసిద్ధి ప్రాప్తిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయని ఆధ్యాత్మిక వేత్త చిల‌కమ‌ర్తి తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000