వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి? దీని విశిష్టత ఏంటి? ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం-how to perform varalakshmi vrat what is special about it lets know about the story of this vratam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి? దీని విశిష్టత ఏంటి? ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం

వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి? దీని విశిష్టత ఏంటి? ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం

HT Telugu Desk HT Telugu
Aug 07, 2024 09:02 AM IST

శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం విశిష్టత, ఎలా ఆచరించాలి అనే దాని గురించి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

<p>శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. &nbsp;ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.</p>
శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. (TTD)

వరలక్ష్మీ వ్ర‌తాన్ని భ‌క్తి శ్ర‌ద్ధల‌తో చేసుకుంటే శుభ ఫ‌లితాలు ఉంటాయ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. ఈ మేర‌కు ఆయన వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌త క‌థ‌, వ్ర‌తాన్ని ఆచ‌రించాల్సిన విధానాల‌ను ప్ర‌త్యేకంగా తెలియ‌జేశారు.

వ్రత విధానం

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ 16వ తేదీన జరుపుకోనున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి పటం ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. అక్షింతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.

కావలసిన వస్తువులు

పసుపు, కుంకుమ, వాయనమునకు అవసరమైన వస్తువులు, ఎర్రటి ర‌విక వ‌స్త్ర‌ము, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వ‌క్క‌లు, తోర‌ముకు దార‌ము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారు చేసుకోవాలి ?

తెల్లటి దారమును ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదులేక తొమ్మిది పోగుల దారమును ఉపయోగించి, ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరాలను తయారుచేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా ! స్త్రీలకు భాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా ! స్త్రీలు, సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని అడిగింది.

అందుకా త్రినేత్రుడు.... దేవీ ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి... దేవా ! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

కాత్యాయనీ.. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం

వరలక్ష్మీ వ్రతానికి అధిదేవతయైన వరలక్ష్మీ దేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ... ఈ శ్రావ‌ణ పౌర్ణ‌మి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన కానుక‌లు ఇస్తాన‌ని చెప్పి అంత‌ర్థాన‌మైంది. ఆ మాట‌ల‌తో చారుమ‌తి చాలా సంతోషించింది. హే జననీ ! నీ కృపాకటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు.

ఓ పావనీ! నా పూర్వ‌జ‌న్మ సుకృతం వ‌ల్ల నీ ద‌ర్శ‌నం నాకు క‌లిగిందని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు చాలా సంతోషించి చారుమ‌తిని వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌త‌మును చేసుకోవల‌సింద‌ని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో “సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకున్నారు. (శక్తికొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

లక్ష్మీకటాక్షం

మొదటి ప్రదక్షిణం చేయగానే కాలి అందియలు ఘల్లు ఘల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితలయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయాయి.

ఆయా స్త్రీల ఇళ్ల నుండి గ‌జ తుర‌గ ర‌థ వాహ‌నాముల‌తో వ‌చ్చి వారిని ఇళ్ల‌కు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు నుండి రధ వాహనములతో వచ్చి వారిని ఇళ్ళకు తీసుకువెళ్లారు. తామందరిని మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీవ్రతంతో ప్రతి సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి, సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు.

మునులారా... శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.

ఈ కథ విని, అక్షతలు శిరసుపై ఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి.

॥మంగళం మహత్ ॥

ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner