Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకత.. మహాలక్ష్మిని ఆహ్వానించడానికి ఏం చేయాలంటే
Varalakshmi vratam: శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు మహాలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఏం చేయాలో పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Varalakshmi vratam: శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది. శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని "వరలక్ష్మి" పేరుతో అర్చించడం మన సంప్రదాయమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సర్వవిధ సంపదలను అనుగ్రహించే వ్రతమిది. కలశాన వరలక్ష్మిని ఆవాహనచేసి షోడశోపచారాలతో పూజించడం ఈ వ్రతాచరణ విధి.
స్త్రీలందరూ లక్ష్మీ సమానంగా అలంకరించుకొని, అమ్మవారిని అర్చిస్తారు. రెండో శుక్రవారమే శ్రావణ శుక్రవారం. ఇదే శ్రీ వరలక్ష్మీ వ్రత దినం. అయితే శ్రావణమాసం గనుక శుక్రవారంతో మొదలయితే దానికి అంతకుముందు రోజే నిష్క్రమించిన అమావాస్య స్పర్శ కొంతైనా ఉంటుంది. గనుక అలా వచ్చినపుడు మాత్రమే 3వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాచరణ చెప్పబడింది. వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్త్రీలు, రాఖీ పండుగ జరుపుకునే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు, నూతన యజ్ఞోపవీత ధారణ చేసే పురుషులు.... ఈ శ్రావణ పౌర్ణమి, శుక్రవారం సంబరాలతో ఈ శ్రావణంలో లోగిళ్లన్నీ కోలాహలంగా ఉంటాయి.
ఈ మూడు విశిష్ట పర్వదినాలు ముప్పేటగా ఒక్క రోజునే రావడం విశేషంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో మహాలక్ష్మిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి సుఖ సంతోషాలు ఏర్పడతాయని చిలకమర్తి తెలిపారు. అమ్మవారిని అలంకరించుకుని ఉన్నంతలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సిద్ధం చేసి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేస్తే దయగల మా తల్లి కరుణించి ఆ ఇంట కాసుల వర్షం కురిపిస్తుందని పంచాంగకర్త ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.