Sravana masam 2024: శ్రావ‌ణ మాస ప్రాముఖ్య‌త‌.. ఆ మాసంలో పాటించాల్సిన నియ‌మాలేంటి..?-importance of sravana month what are the rules to be followed in that month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sravana Masam 2024: శ్రావ‌ణ మాస ప్రాముఖ్య‌త‌.. ఆ మాసంలో పాటించాల్సిన నియ‌మాలేంటి..?

Sravana masam 2024: శ్రావ‌ణ మాస ప్రాముఖ్య‌త‌.. ఆ మాసంలో పాటించాల్సిన నియ‌మాలేంటి..?

HT Telugu Desk HT Telugu

Sravana masam 2024: శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏంటి?ఈ మాసంలో వచ్చే పండుగల విశిష్టత, పాటించాల్సిన నియమాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వరలక్ష్మీ వ్రతం

Sravana masam 2024: నిత్యం ఆధ్యాత్మిక ధార్మిక పరిమళాలతో భక్తకోటి పునీతమయ్యే పరమ పవిత్ర మాసం శ్రావణమ‌ని ప్ర‌మ‌ఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

శ్రీకృష్ణుడు, హయగ్రీవుల జయంతులు ఈ మాసంలోనే. వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ నోములు, సోమవారాల్లో పరమశివుడికి అభిషేకాలు, పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణం, రక్షాబంధనం తదితర పర్వదినాల, ఎన్నో విశిష్టతల సమాహారం ఈ మాసమ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. సౌభాగ్యం, సౌశీల్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం వ్రతాలు ఆచరించే మాసం శ్రావణమాసమ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఉపాసనా ప్రధానమైన వైదిక సంస్కృతిలో ఈ మాసానికి గల ప్రత్యేకత ఎనలేనిది.

శ్రావణ మాస విశిష్టత

శ్రావణమాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయి” అని సాక్షాత్తూ ఈశ్వరునిచే శ్రావణమాస మహిమ కీర్తించబడింది. స్త్రీలకు అత్యంత పవిత్రమైనదీ మాసం. ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను ప్రత్యేకతను సంతరించు కున్న మాసం శ్రావణమాసం. పేరులోని శృతికి ఇంపైన ఈ మాసంలో మానవులు తరించడానికి కావలసిన పర్వాలన్నీ నిండి ఉన్నాయి.

శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లూ దేవాలయాన్ని తలపిస్తుంది. మాసమంతా ఎక్కడ చూసినా భగవ న్నామ స్మరణే వినిపిస్తుంది. శ్రావణ శుక్ల చవితి నాడు నాగచతుర్థీ, పంచమి నాడు నాగ దేవతను ఆరాధిస్తారు. నాగదేవతను ఆరాధిస్తే చెవులకు సంబంధించిన సమస్యలు, గ్రహపీడలు తొలగిపోతాయనే ప్రగాఢ విశ్వాసం భక్తుల హృదయాలలో నిబిడీకృతమై ఉంది. పసుపు కలిపిన చందనంతో గోడపై పడగలు కలిగిన నాగ చిత్రములు లిఖించి దూర్వాలు, పువ్వులు, అక్షతలతో పూజించి గోధుమనూక ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల నాగదోషాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

పుత్రద ఏకాదశి

అదేవిధంగా శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి (లేదా) లలిత ఏకాదశి అంటారు. నారాయణుని శ్రీధర నామంతో పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు విష్ణుమూర్తిని గాని, అమ్మవారిని గాని పూజిస్తే సకల లక్షణ శోభితుడైన పుత్రులు జన్మిస్తారని విశ్వాసం. ఈ ఏకాదశి నాడు గొడుగు దానం చేయడం విశేష పుణ్యఫలప్రదం. మరుసటి రోజు వచ్చే ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. ఈనాడు నారాయణుని దామోదర నామంతో పూజించి విష్ణు ప్రతిమను దానం చేయడం వలన దామోదరుడైన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.

శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అంటారు. జంధ్యాల పూర్ణిమనే 'ఉపాకర్మ' అంటారు. ఈరోజు జీర్ణమైన యజ్ఞోప వీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోప వీతధారణ చేసి జప, అర్చనాదులను నిర్వహిస్తుంటారు. అన్నాచెల్లెళ్ల అను బంధానికి గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే సోదరి సోదరునకు నుదుట కుంకుమ బొట్టు పెట్టి, కుడి చేతి మణికట్టుకు రాఖీని కడతారు. రక్షాబంధనం అరిష్టాలను తొలగిస్తుంది. రాఖీని కడుతున్న సమయంలో

“యేన బద్దో బలిరాజా దానవేంద్రో మహాబలః

తనత్వామభి బధ్నామి రక్షే మాచల మాచలః"

అనే శ్లోకాన్ని పఠించాలి. అనంతరం తమ సోదరులకు మిఠాయిలను తినిపించి ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. సోదరులు రాఖీ కట్టిన సోదరీమణులను ఆశీర్వదించి వారికి రక్షణగా మేము ఉన్నామని బలమైన విశ్వాసాన్ని కలిగిస్తారు. బహుమతులను ఇచ్చుకుంటారు. సోదర సోదరీమణుల అనురాగబంధానికి ప్రతీక రాఖీ పండుగ.

హయగ్రీవ జయంతి

ఈ పూర్ణిమనాడే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అనేక పర్యాయాలు అవతరించాడు. ఒక్కొక్క మారు ఒక్కొక్క రూపం. చేయవలసిన కార్యాన్నిబట్టి, ఆయా కాలాలకు తగిన ధర్మాన్నిబట్టి స్వామి వివిధ రూపాల్లో అవతరిస్తుంటాడు. నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ ఒక రూపాన్ని అవతరించడమే అవతారం. ఈ అవతారాలలో కొన్ని లీలావతారాలు, కొన్ని అంశావతారాలు, మరికొన్ని పూర్ణావతారాలు.

ఈ అవతారాలలో తెలిసి నవి, తెలియనివి మరెన్నో ఉన్నాయి. ఎక్కువ మందికి తెలియని అవతారాలలో ఒకటి హయగ్రీవ అవతారం. విష్ణుమూర్తి హయ గ్రీవునిగా అవతరించిన ఈ రోజున ఆయనను ఆరాధించినట్టయితే విద్యాభివృద్ధి కలుగుతుంది. ఎందువలననగా విద్యను ప్రసాదించే గురువుగా హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ స్వామిని శివపరంగా కొలిచిన 'దక్షిణామూర్తి' అని, దేవీపరంగా ఉపాసిస్తే 'శారదామూర్తి' అని చెబుతూ ఉంటారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అని అభిఏ విద్యకైనా ఫలం జ్ఞానం ఆనందం. ఈ రెండింటి కలయికే హయగ్రీవమూర్తి.

వరలక్ష్మీ వ్రతం

శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం 'వరలక్ష్మీ వ్రతం' అనే పేరుతో శ్రీమహాలక్ష్మిని ఆరాధించడ మొక ఆచారంగా, సంప్రదాయంగా వస్తోంది. సౌభాగ్యాన్ని, సంపదలను అనుగ్ర హించే వ్రతమిది. వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అను గ్రహించే మాత వరలక్ష్మీదేవి. 'వర' అనగా 'కోరుకున్నది', 'శ్రేష్ఠమై నది' అనే అర్థాలు ఉన్నాయి. కోరిన కోర్కెలు లేక శ్రేష్ఠమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావిస్తారు. ఈ దేవిని సమంత్రకంగా, భక్తిభావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.

శ్రావణ మాసం నందు మహిళలందరూ ఐకమత్యంతో కలిసి మెలసి సరదాగా, ఉత్సాహంతో, ఉల్లాసంతో పూజలు, పేరంటాలు మున్నగు వాటిలో పాల్గొంటూ నెల రోజులూ ఆనందంగా గడిపేస్తారు. వ్రతం రోజులలో బాలికలు, ముత్తయిదువలు కాళ్లకు పసుపు రాసుకుని, కాళ్లకు బొట్టు పెట్టుకొని, కళ్లకు కాటుక బొట్టు పెట్టుకొని, పట్టు పరికిణీలు, పట్టుచీరలు ధరించి, నగలు ధరించి ముత్తయిదువులు బాలికలు వస్తుంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే ఇంట్లోకి వస్తోందన్న భావన కలుగుతుంద‌ని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ