NEET-UG 2024: నీట్ యూజీ 2024 రద్దు పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
NEET-UG 2024: నీట్ యూజీ 2024 ను రద్దు చేసి, మళ్లీ, కొత్తగా పరీక్షను నిర్వహించడానికి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష ను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామని స్పష్టం చేసింది.
NEET-UG 2024: నీట్-యూజీ 2024 పై మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను ఆషామాషీగా తీసుకోలేమని స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపరు విస్తృత స్థాయిలో లీక్ అయినట్లుగా తాము భావించడం లేదని తెలిపింది. అందువల్ల, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదన్నది తమ అభిప్రాయమని తెలిపింది. అనంతరం, మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
రద్దు అవసరం లేదు
పరీక్ష ఫలితాలు తారుమారు అయ్యాయని లేదా పరీక్ష నిర్వహణలో వ్యవస్థాగత ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సుప్రీంకోర్టు ధర్మాసనానికి నేతృత్వం వహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘ప్రశ్నాపత్రం విస్తృత స్థాయిలో లీక్ అయినట్లు రికార్డుల్లో ఉన్న డేటా సూచించడంలేదని, రికార్డుల్లో ఉన్న అంశాల ఆధారంగా నీట్ ను రద్దు చేయడం సమర్థనీయం కాదు. అవసరం లేదు’’ అని సీజేఐ పేర్కొన్నారు. మళ్లీ కొత్తగా నీట్-యూజీని ఆదేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఈ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
పరీక్ష నిర్వహణ ప్రక్రియను పటిష్టం చేయాలి
నీట్ యూజీ (NEET-UG 2024) పరీక్ష నిర్వహణ ప్రక్రియను పటిష్టం చేయాలని, తద్వారా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా చూడాలని సుప్రీంకోర్టు (supreme court) ఆదేశించింది. ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన తదుపరి ఆదేశాలకు కమిటీ కట్టుబడి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
24 లక్షల మంది విద్యార్థులు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది నీట్-యూజీ (NEET-UG 2024) ని మే 5న నిర్వహించగా, 14 విదేశాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో 23.33 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు.