NEET UG 2024 : నీట్‌కు సంబంధించిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ
NEET UG 2024 Paper Leak : నీట్ పేపర్ లీకేజీపై ఇప్పటికే చాలా పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేయనుంది.
మే 5న జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్-యూజీ 2024పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు జూలై 22 సోమవారం విచారణ జరపనుంది. గతంలో విచారణ చేసిన సుప్రీం కోర్టు సెంటర్ల వారీగా ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. పేపర్ లీకేజీ, మార్కుల విషయంలో పలు ఆరోపణలతో సతమతమవుతున్న మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను సెంటర్ల వారీగా విడుదల చేశారు.
జూలై 22న సుప్రీంకోర్టు వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసిన కాజ్ లిస్ట్ ప్రకారం, నీట్-యూజీ వివాదంపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ కొరింది. 40కి పైగా పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
ఎన్టీఏ విడుదల చేసిన డేటా విశ్లేషణలో పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలతో లబ్ధిపొందిన అభ్యర్థులు రాణించలేదని తేలింది. 4,750 కేంద్రాలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థుల భారీ డేటాను అంతా కలిపి కాకుండా.. సెంటర్ల వారీగా విడుదల చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష భవితవ్యంపై తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై పలు పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ డేటాను విడుదల చేసింది ఎన్టీఏ.
ఒయాసిస్ స్కూల్, హజారీబాగ్, జార్ఖండ్, హర్దయాల్ పబ్లిక్ స్కూల్, ఝజ్జర్, హర్యానా, గుజరాత్లోని గోద్రాలోని జే జలరామ్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి కేంద్రాల్లో అభ్యర్థుల పనితీరు చాలా తక్కువగా ఉంది. నీట్-యూజీ 2024 నిర్వహణలో అవకతవకలపై విచారణ జరపాలని, పరీక్షను రద్దు చేయాలని, పునఃపరిశీలన చేయాలని కోరుతూ మెుదట దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఆ తర్వాత విచారణను జూలై 18కి వాయిదా వేసింది.
దర్యాప్తులో పురోగతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి స్టేటస్ రిపోర్టు అందిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్-యూజీ 2024 ఫలితాల డేటా విశ్లేషణలో భారీ అవకతవకలు జరిగినట్లుగానీ, అసాధారణంగా అధిక మార్కులు సాధించిన అభ్యర్థుల స్థానికతగానీ కనిపించలేదని కేంద్రం గత వారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో పేర్కొంది.
తర్వాత విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నీట్-యూజీ 2024 పవిత్రతను ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఈ మొత్తం ప్రక్రియకు ఆటంకం కలిగితే తిరిగి పరీక్షకు ఆదేశిస్తామని కూడా చెప్పింది ధర్మాసనం. పిటిషనర్లు పేర్కొన్న అవకతవకలను అర్థం చేసుకోవడానికి పేపర్ లీకేజీ సమయం, విధానంతో పాటు తప్పు చేసిన వారి సంఖ్యతో సహా వివరాలను ఎన్టీఏ, సీబీఐలను కోరింది.
విదేశాల్లోని 14 నగరాలతో సహా దేశంలోని 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5న విద్యార్థులు పరీక్ష రాశారు. పెద్ద ఎత్తున గోప్యతను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పుడు పరీక్షను రద్దు చేయడం ప్రతికూలంగా ఉంటుందని కేంద్రం, ఎన్టీఏ గతంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నాయి. లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులను తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపాయి.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ)ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.