TGPSC Group 2 : తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా… డిసెంబర్ లో పరీక్షలు - TGPSC ప్రకటన
TGPSC Group 2 Exams Updates : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను డిసెంబరులో నిర్వహించనున్నారు. TGPSC నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.

TSPSC Group 2 Exam Postpone 2024 : డీఎస్సీ పరీక్షలతో పాటు నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబరులో నిర్వహించనున్నారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్ 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. నిరుద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో నిన్న, ఇవాళ పలువురు అభ్యర్థులతో ప్రభుత్వంలో ఉన్ప కొందరు ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఆ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వాయిదా ప్రకటన వెలువడినట్లు సమాచారం.
గతేడాది నోటిఫికేషన్…ఆపై వాయిదాలు
మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
తొలుత గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమిషన్.
నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగా… ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు నడుస్తున్నాయి. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు కొంత గడువు కావాలని నిరుద్యోగులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ఇటీవలే టీజీపీఎస్సీని కూడా ముట్టడించేందుకు యత్నించారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం… గ్రూప్ 2 విషయంలో మాత్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణను డిసెంబర్ కు వాయిదా వేయటంతో… గ్రూప్ 2 అభ్యర్థులకు గడువు దొరికినట్లు అవుతుంది. అయితే పోస్టుల సంఖ్యను పెంచుతారా..? లేదా ప్రస్తుతం ఉన్న పోస్టులతోనే ముందుకెళ్తారా…? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది…!
కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు….
మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్షలు గురువారం జూలై 18 నుంచి ప్రారంభం అయ్యాయి. ఆన్లైన్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో ముగియనున్నాయి.