UP BJP debacle: ‘‘లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓటమికి కారణాలివే’’: తేల్చి చెప్పిన పార్టీ చీఫ్
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణాల్లో ఒకటి.. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఆశించిన స్థానాలను గెలవలేకపోవడమేనన్నది రాజకీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. అయితే, యూపీలో ఈ పరాజయానికి కారణాలను విశ్లేషించే పనిలో బీజేపీ అధిష్టానం పడింది.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పేలవమైన ప్రదర్శనకు కారణాలను వెతికే పనిలో పార్టీ అధిష్టానం పడింది. రాష్ట్రంలోని పార్టీ సీనియర్ల నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటోంది. అందులో భాగంగా యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ఢిల్లీ వెళ్లి, పార్టీ అధ్క్ష్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
ఆ మూడే ప్రధాన కారణాలు..
పార్టీ వర్గాల సమాచారం మేరకు.. యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శనకు, ఆశించిన స్థాయిలో సీట్లను గెలవలేకపోవడానికి పలు కారణాలను భూపేంద్ర సింగ్ చౌదరి పార్టీ అధిష్టానానికి వివరించారు. వాటిలో మూడు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. అవి
- యాదవేతర ఓబీసీ ఓట్లు ఈ సారి సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్ కూటమికి వెళ్లడం.
- జాటవేతర ఎస్సీ ఓట్లు కూడా సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్ కూటమికి షిఫ్ట్ కావడం.
- అలాగే, ఇన్నాళ్లూ బీఎస్పీ కి ప్రధాన ఓటు బ్యాంక్ గా ఉన్న జాటవ్ ఓట్లు కూడా విపక్ష ఎస్పీ - కాంగ్రెస్ కూటమికి వెళ్లడం.
- యూపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు
ఇవి కాకుండా, పలు ఇతర కారణాలను కూడా భూపేంద్ర సింగ్ చౌదరి వివరించారు.
2014 నుంచి..
2014 నుంచి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన, అత్యధిక లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే, క్రమంగా వివిధ కారణాలతో పార్టీ బలహీనపడుతూ వచ్చింది. ఆధిపత్య కుర్మీలతో సహా ఓబీసీయేతర ఓట్లు, పాసీలతో సహా ఎస్సీయేతర ఓట్లు ఎస్పీ-కాంగ్రెస్ వైపు మళ్లాయని పార్టీ అగ్రనేతలకు చౌధరి వివరించారు. 2014 నుంచి యాదవేతర ఓబీసీలు, జాతవ్ యేతర ఎస్సీల ఓట్లలో కనీసం 10 శాతం తమకు వస్తున్నాయని బీజేపీ భావిస్తోంది. కానీ 2024లో ఈ ఓటు బ్యాంకులో 5-6 శాతం ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి వలస వెళ్లింది.
నోటి దురుసు..
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ-ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా కొంత పని చేసిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చౌధరి పార్టీ అగ్ర నేతలకు వివరించారు. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీని దెబ్బ తీశాయని తెలిపారు.
అభ్యర్థులపై వ్యతిరేకత
మరోవైపు, బీజేపీ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కూడా ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడానికి కారణమని బీజేపీ భావిస్తోంది. యూపీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి ప్రజాదరణ కలిగిన నేతలకు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు మార్జిన్ భారీగా తగ్గడం గమనార్హం. అదీకాకుండా, రాష్ట్రంలోని అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, రాజ్ పుత్ ల (ఠాకూర్ల) అసంతృప్తి, రాష్ట్రంలోని వివిధ పోటీ పరీక్షల పేపర్లు పదేపదే లీక్ కావడం వంటివి కూడా పార్టీ పేలవ ప్రదర్శనకు కారణాలుగా నిలిచాయి.
మార్పులు చేస్తారా?
అక్టోబర్-నవంబర్ నెలల్లో యూపీలో బీజేపీ నాయకత్వంలో కీలక మార్పలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే, జాతీయ స్థాయిలో కూడా వచ్చే ఏడాది జనవరిలో జేపీ నడ్డా స్థానంలో కొత్త జాతీయ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ మళ్లీ పూర్తి స్థాయిలో పుంజుకునేల కార్యాచరణ రూపొందించాలని బీజేపీ భావిస్తోంది.