Raja Pateria : ‘రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే.. ప్రధానిని చంపేయండి!’
Raja Pateria remarks on PM Modi : ‘రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే.. ప్రధాని మోదీని చంపేయాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియా. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి.
Raja Pateria remarks on PM Modi : మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. 'రాజ్యాంగాన్ని కాపాడాలంటే.. ప్రధానిని చంపేయండి' అని అర్థం వచ్చే విధంగా ఆయన ప్రసంగించారు.
‘నా ఉద్దేశం అది కాదు..’
పన్నా జిల్లా పవాయ్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజా పటేరియా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు, ప్రధాని, రాజ్యాంగంపై పలు వ్యాఖ్యలు చేశారు.
"ఎన్నికలకు మోదీ ముగింపు పలుకుతారు. మతం, కులం, భాష ఆధారంగా విభజన చేస్తారు. దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే.. ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధపడాలి," అని రాజా పటేరియా వ్యాఖ్యానించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Raja Pateria Congress : ఈ ప్రసంగం చేసిన కొద్ది సేపటికే.. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రధానిని చంపడం అంటే.. హత్య చేయడం కాదని, ఎన్నికల్లో ఓడించాలన్న ఉద్దేశంతో ఆ విధంగా వ్యాఖ్యానించినట్టు స్పష్టం చేశారు. తాను మహాత్మా గాంధీని అనుసరిస్తానని, హింసను ప్రోత్సహించనని అన్నారు. మైనారిటీలను కాపాడాలంటే మోదీని ఓడించాలన్నదే తన ఉద్దేశం అని పేర్కొన్నారు.
రాజా పటేరియా వివరణ వృథా అయిపోయింది. ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం చెలరేగింది. రాజా పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశించారు.
"పటేరియా చేసిన వ్యాఖ్యలను నేను విన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీది కాదని చెప్పేందుకు ఆ వీడియో చాలు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇటలీకి చెందినది. పార్టీలో ముస్సోలీనీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాను," అని నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
'వంద తలల రావణాసురుడు..'
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అవి రాజకీయ దుమారానికి దారితీయడం కొత్త విషయమేమీ కాదు. ఇటీవలే.. మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Kharge's Ravanasura jab at PM : గుజరాత్ ఎన్నికల సమయంలో మోదీ విపరీతంగా ప్రచారాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. ప్రతీ ప్రచారంలోనూ ప్రధాని మోదీ స్వీయ ప్రశంసలే చేసుకుంటున్నారని, తనను చూసి ఓటేయమని కోరుతున్నారని ఖర్గే విమర్శించారు. “ఎవరినీ చూడొద్దు. నన్ను చూడండి. నా ముఖం చూసి ఓటేయండి అంటున్నావు. ఎన్ని సార్లు చూడాలి మీ ముఖం? ఎన్ని రూపాలు ఉన్నాయి మీకు? మీకేమైనా వంద తలలున్నాయా రావణాసురిడిలా?” అని ఖర్గే మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వీడియోను కాంగ్రస్ ట్విటర్ లో షేర్ చేసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది.
సంబంధిత కథనం