Jagan Defeat: ఓటు బ్యాంకు వర్గాలు కూడా ఎన్నికల్లో జగన్‌ను నమ్మలేదా,అతి ప్రచారం వికటించిందా?-even the vote bank groups do not believe in jagan in the election is the campaign distorted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Defeat: ఓటు బ్యాంకు వర్గాలు కూడా ఎన్నికల్లో జగన్‌ను నమ్మలేదా,అతి ప్రచారం వికటించిందా?

Jagan Defeat: ఓటు బ్యాంకు వర్గాలు కూడా ఎన్నికల్లో జగన్‌ను నమ్మలేదా,అతి ప్రచారం వికటించిందా?

Sarath chandra.B HT Telugu

Jagan Defeat: కర్ణుడి చావుకు కారణాలు అనేకం మాదిరి ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి కూడా చాలా కారణాలు వెలుగు చూస్తున్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ పదేపదే ఊదరగొట్టినా జగన్ మాటల్లో డొల్లతనాన్ని అయా వర్గాలు గ్రహించడం వల్లే ఓటమి పాలయ్యారనే వాదనలు ఉన్నాయి.

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలతో జగన్ సమావేశం

Jagan Defeat: ఏపీలో వైసీపీ ఘోర పరాజయాన్ని విశ్లేషించే క్రమంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంలో జగన్‌ వారిపై మితిమీరిన ప్రేమ ఒలకబోయడం కూడా మిగిలిన వర్గాల అసంతృప్తి, ఆగ్రహానికి కారణం అయ్యాయి.

ఎన్డీఏ కూటమి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండవని, 4శాతం రిజర్వేషన్లు బీజేపీ కూటమి వస్తే అందవని, వైసీపీ 7సీట్లు మైనార్టీ అభ్యర్థులకు ఇచ్చాను అని చెప్పుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరపున జగన్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన వాళ్ళు శుద్ధ పూసల అంటే ఏమి కాదు. వాళ్ళ మీద బోలెడు అభియోగాలు ఉన్నాయి.

డిప్యూటీ సిఎం మొదలుకుని మాజీ ఐఏఎస్ వరకు జనంలో బాగా వ్యతిరేకత మూట గట్టుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారు. విజయవాడ, గుంటూరులో అభ్యర్థుల మీద స్థానిక ముస్లిం ఓటర్లలో కూడా వ్యతిరేకత ఉంది. ఐదేళ్ల పాలనలో అధికారం అడ్డం పెట్టుకొని సొంత సామాజిక వర్గం వారిని కూడా వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక ఎన్నికల సమయంలో జగన్ మైనార్టీల మీద చూపించిన ఆసక్తి మిగిలిన వర్గాల అసంతృప్తి కి కారణం అయ్యింది. విజయవాడలో సంఖ్య పరంగా ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్న చోట మైనార్టీలకు కేటాయించడం ఆ వర్గం ఓటర్లను దూరం చేసిందని చెబుతున్నారు. దీంతో పాటు బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్లు ఉండవని, తాను ఇస్తానంటూ అవసరానికి మించి వైసీపీ శిబిరం ప్రచారం చేసింది. మైనార్టీలను ఆకట్టుకోడానికి జగన్ చేసిన ప్రకటనలు మిగిలిన వర్గాలను అప్రమత్తం అయ్యేలా చేసింది.

విజయవాడ తో పాటు కోస్తా లో చాలా ప్రాంతాల్లో ముస్లింలను గతంలో ప్రత్యేకంగా గుర్తించడం కష్టంగా ఉండేది. పేరు చెబితే తప్ప చాలా సందర్భాల్లో గుర్తించే అవకాశం కూడా ఉండేది కాదు . ఇటీవల కాలంలో స్వీయ అస్తిత్వాన్ని వెదుక్కునే క్రమంలో చాలా మంది బాహ్య వేషధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మత పరమైన అభద్రత, రాజకీయ గుర్తింపు, స్థానిక ప్రాబల్యం వంటి కారణాలతో తమను తాము బహిరంగంగా ప్రదర్శించే ధోరణి పెరిగింది.

ఇది అయా ప్రాంతాల్లో సహజంగా ఉండే శాంతియుత సహజీవన వాతావరణంలో ఎన్నికల సమయంలో ఓటర్లలో పరస్పర అపనమ్మకం కలిగించింది. సరిగ్గా ఎన్నికల సమయానికి కూటమిలో బీజేపీ జట్టు కట్టడం, వైసీపీ అధ్యక్షుడు పదేపదే చేసిన ప్రకటనలు, ఇతరత్రా జగన్ మీద ఉన్న సహజ వ్యతిరేకతకు ఆజ్యం పోశాయి.వెరసి మైనార్టీ స్థానాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బొక్క బోర్లా పడ్డారు.

ప్రచారంలో విమర్శిస్తూ పరోక్షంగా మద్దతివ్వడం..

ఏపీలో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేకున్నా అంతకు మించిన బంధాన్ని కొనసాగించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువగా బీజేపీతో అంటకాగారు. వివాదాస్పద బిల్లులకు మద్దతివ్వడం మొదలుకుని బీజేపీ చెలిమి కోసం చేసిన చర్యల్ని ప్రజలు గుర్తించారు. బీజేపీతో ఎలాంటి బంధం లేదంటూనే మోదీని ఒక్క మాట కూడా విమర్శించక పోవడం జగన్‌ మీద మైనార్టీల్లో సైతం అపనమ్మకం కలిగేలా చేసింది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను పదేపదే విమర్శించినా బీజేపీని, నరేంద్రమోదీ జోలికి మాత్రం పోలేదు. వారిని తప్పు పట్టేందుకు కూడా సాహసించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాల జోలికి ఎన్నికల ప్రచారంలో వెళ్లలేదు. వాటి అవసరమే లేదన్నట్టు వ్యవహరించారు.

నిజానికి ఏపీలో జగన్మోహన్‌ రెడ్డికి బలమైన ఓటు బ్యాంకు అండగా ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా భావించింది. పార్టీ పత్రికల్లో ఏపీలో దాదాపు 36శాతం ఓట్ల బలం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని అవి అంచనా వేశాయి. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకులు జగన్‌ వెంట ఉంటాయని ఎన్నికలకు ముందు అంచనా వేశాయి. ఎస్సీలు, దళిత క్రైస్తవులు ఎప్పుడు వైసీపీ వెంట నడుస్తారని అవి భావించాయి.

ఎన్నికల ఫలితాలతో ఆ వర్గాల విశ్వాసాన్ని కూడా జగన్ కోల్పోయినట్టు రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నారు. బీజేపీ విషయంలో గోడమీద పిల్లి వైఖరి జగన్‌కు తీవ్ర నష్టం కలిగించింది. క్రిస్టియన్‌ మిషనరీల వ్యవహారంలో ఎయిడెడ్ విద్యా సంస్థల్ని మూసేయడం, ఎయిడ్‌ నిలిపివేయడం ఆ వర్గాల ఆగ్రహానికి కారణమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణల విషయంలో జగన్ మౌనం కూడా అయా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.  ఆ వర్గాల్లోని విద్యావంతులు ఈ అంశాలను బలంగా ప్రచారం చేశారు. ఫలితంగా నా ఎస్సీ, నా ఎస్టీలు,నా మైనార్టీలు నమ్మబలికిన జనం నమ్మలేదు. ఫలితంగా ఘోర పరాజయం మూటగట్టుకున్నారు.

 

సంబంధిత కథనం