Vladimir Putin: ఇటలీలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల కూటమి ‘జీ 7 ’ సదస్సు (G7 summit) జరుగుతున్న సమయంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ తో యుద్ధంపై కీలక ప్రతిపాదన చేశారు. ఉక్రెయిన్ వెంటనే ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని, అలాగే, నాటో (North Atlantic Treaty Organisation) లో చేరే ప్రతిపాదనను విరమించుకోవాలని పుతిన్ షరతు విధించారు.
ఉక్రెయిన్ ఈ షరతులకు అంగీకరిస్తే, తక్షణమే కాల్పుల విరమణ చేస్తామని, అలాగే, చర్చలు ప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం హామీ ఇచ్చారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి యుద్ధం (russia ukraine war) కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేసేందుకు 90కి పైగా దేశాలు, సంస్థలు త్వరలో స్విట్జర్లాండ్ లో సమావేశమవుతున్నాయి. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించలేదు.
ప్రస్తుతం రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు ఐదవ వంతు రష్యా నియంత్రణలో ఉంది. ఆయా ప్రాంతాల నుంచి రష్యా దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించాలని, అప్పుడే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా దళాల దూసుకువెళ్లడానికి కారణం, శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ ను అంగీకరించేలా చేయడమేనని పుతిన్ (Putin) శుక్రవారం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ రాజధానిని ముట్టడించే ఉద్దేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. అయితే, ఈ యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ సమర్ధంగా నియంత్రిస్తోంది. ఉక్రెయిన్ కు ఈ యుద్ధంలో అమెరికా, యూరోప్ దేశాల మద్దతు లభిస్తోంది.
ఉక్రెయిన్ తో యుద్ధంలో విజయం సాధించడానికి అణ్వాయుధాలను ఉపయోగించే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ‘‘అసాధారణ సందర్భంలో దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగిస్తాం. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధంలో అలాంటి పరిస్థితి వచ్చిందని నేను అనుకోవడం లేదు. అలాంటి అవసరం లేదు’’ అని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పష్టం చేశారు.