వచ్చే ఐదేళ్లలో ఆటోమెుబైల్ ఇండస్ట్రీలో ప్రపంచానికి భారత్ బిగ్‌బాస్ : నితిన్ గడ్కరీ
Automobile News : ఇప్పటికే భారతీయ ఆటోమెుబైల్ ఇండస్ట్రీ ప్రపంచంతో పోటీ పడుతుంది. అయితే రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
భారతీయ ఆటో పరిశ్రమ గత పది పదిహేనేళ్లలో అద్భుతమైన వృద్ధితో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు భారతదేశంలో తమ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అలాగే భారత్ నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు కార్లు కూడా ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ ఆటో పరిశ్రమలో ప్రస్తుతం టాప్ 3 స్థానంలో భారత్ ఉంది. రానున్న సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా చెప్పారు.
ప్రస్తుతం అమెరికా, చైనా ప్రపంచ ఆటో పరిశ్రమలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఆ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉందని, వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా అవతరిస్తుందన్న నమ్మకం ఉందని నితిన్ గడ్కరీ అన్నారు.
ఢిల్లీలో జరిగిన అమెజాన్ SMEBhav 2024 ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఆటోమొబైల్ పరిశ్రమ, ఈవీ రంగం ప్రస్తుతం ఇతర దేశాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. భారతదేశం అత్యధిక యువత, ఇంజనీరింగ్ ప్రతిభను కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు.
'ప్రపంచంలోని అన్ని పెద్ద ఆటోమొబైల్ బ్రాండ్‌లు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. మేం భారతీయ పరిశ్రమను శక్తివంతం చేయడానికి వివిధ సాంకేతికతపై పనిచేస్తున్నాం. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు, విజయవంతమైన అభ్యాసాలను అందిస్తున్నాం. భవిష్యత్తులో జ్ఞానాన్ని సంపదగా మార్చడమే అత్యంత ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. ' అని ఆయన చెప్పారు.
అదే సమయంలో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌పై మాట్లాడుతూ జీవ ఇంధనాలను వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పెట్రోప్లాస్టిక్‌లు, లోహాలు, గాజులను మనకు సాధ్యమైనంత ఉత్తమంగా వేరు చేయడం ద్వారా సేంద్రీయ వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను తయారు చేయాలనేది మా ఆలోచన అని ఆయన చెప్పారు.
అందుబాటులో ఉన్న ఈ పదార్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయడం సాధ్యమవుతుందని కేంద్రమంత్రి అన్నారు. సాంకేతికతను ఉపయోగించి ఈ వ్యర్థాలను హైడ్రోజన్-గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చవచ్చని తెలిపారు.