Ayush Badoni Nitish Rana Fight: మైదానంలో గొడవపడిన భారత క్రికెటర్లు.. ఐపీఎల్ నుంచి మారని నితీశ్ రాణా తీరు
Ayush Badoni Nitish Rana Fight: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆయుష్ బదోనితో కావాలనే నితీశ్ రాణా గొడవ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. నిత్యం వివాదాల్లో ఉండే రాణా.. బుధవారం కూడా..?
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భారత క్రికెటర్లు నితీశ్ రాణా, ఆయుష్ బదోని గొడవపడ్డారు. ఢిల్లీ తరఫున బదోని ఆడుతుండగా.. ఉత్తరప్రదేశ్ తరఫున నితీశ్ రాణా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గొడవ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ జరగగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటికే మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కావాలనే గొడవ
ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో నితీశ్ రాణా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బయటికి వచ్చిన వీడియోలో నితీశ్ బౌలింగ్ చేసిన తర్వాత సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వస్తున్న ఆయుష్ బదోనికి కావాలనే అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. తొలుత పక్కకి తప్పుకున్న బదోని.. ఆ తర్వాత నితీశ్ రాణా హద్దులు దాటడంతో ఘాటుగానే బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని ఆటగాళ్లను శాంతింపజేశారు.
నిత్యం వివాదాల్లో రాణా
నితీశ్ రాణా తరచూ ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆటగాడు హృతిక్‌తో మైదానంలో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లోనూ ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడం.. వారితో వాగ్వాదానికి దిగడం ద్వారా నితీశ్ రాణా వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్‌లోనూ మళ్లీ ఫైట్
ఐపీఎల్ 2025 సీజన్ కోసం నితీశ్ రాణాను కోల్‌కతా నైట్‌రైడర్స్ అట్టిపెట్టుకోకుండా వేలానికి వదిలేసింది. దాంతో వేలంలో అతడ్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోనీని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ రూ.4 కోట్లకి కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2025లోనూ ఈ ఇద్దరి మధ్య వార్ జరిగే అవకాశం ఉంది.