Indian students in Russia: నదిలో పడిపోయి రష్యాలో నలుగురు భారతీయ విద్యార్థుల మృతి
రష్యాలో నదిలో పడిపోయి నలుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఆ విద్యార్థులు వెలిక్ నోవ్గోరోడ్ లోని ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు. నదిలో పడిపోయి మరణించిన విద్యార్థుల మృతదేహాలను భారత్ కు తీసుకువస్తున్నారు.
రష్యాలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న మహారాష్ట్రకు చెందిన నలుగురు భారతీయ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి నదిలో మునిగి చనిపోయారు. ఐదో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విద్యార్థులందరూ వెలిక్ నోవ్గోరోడ్ లోని యారోస్లావ్-ది-వైజ్ నోవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు. ఆ ఐదుగురు విద్యార్థులు వోల్ఖోవ్ నది వెంబడి వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీసింది. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తోంది.
మృతదేహలను భారత్ కు తరలించే ప్రయత్నాలు
ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థుల మృతదేహలను భారత్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తమ కాన్సులేట్ విశ్వవిద్యాలయ అధికారులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది.
మహారాష్ట్ర విద్యార్థులు
ఈ ప్రమాదంలో చనిపోయిన నలుగురు విద్యార్థులతో పాటు ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో విద్యార్థిని కూడా మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతులను హర్షల్ అనంతరావు దేసాలే, జిషాన్ అష్పక్ పింజారీ, జియా ఫిరోజ్ పింజారీ, మాలిక్ గులాంగౌస్ మహ్మద్ యాకూబ్ గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని పేరు నిషా భూపేశ్ సోనావానే. వీరంతా 18 నుంచి 20 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని నిషా కు చికిత్స అందిస్తున్నారు.
నది పక్కగా వాకింగ్ చేస్తూ..
ప్రమాదం జరిగిన తీరును ఒక అధికారి వివరించారు. విహార యాత్రగా బయటకు వచ్చిన విద్యార్థులు వోల్ఖోవ్ నది వెంబడి వాకింగ్ చేస్తున్నారు. ఆ తరువాత నదిలో కాసేపు ఈత కొట్టాలన్న ఆలోచనతో వారు నీటిలోకి దిగారు. ఆ సమయంలో విద్యార్థుల్లో ఒకడైన జిషాన్ పింజరి తన తల్లిదండ్రులతో వీడియో కాల్ లో ఉన్నారు.
కుటుంబ సభ్యులు చూస్తుండగానే..
తాము చూస్తుండగానే, అతనితో పాటు మరో ముగ్గురు నీటిలో మునిగిపోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వోల్ఖోవ్ నదిలోకి దిగగానే జిషాన్ తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేశాడు. అతని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు జిషాన్ ను, ఇతరులను నదిలో నుంచి బయటకు రావాలని వేడుకుంటుండగానే, నీటి ఉధృతికి వారు కొట్టుకుపోయారు అని వారి కుటుంబ సభ్యుడు స్థానిక మీడియాకు తెలిపారు.