'Robot suicide': పని ఒత్తిడి ఇప్పుడు రోబోలకు కూడా వస్తోంది. అవును, మీరు చదివింది నిజమే. దక్షిణ కొరియాలో ఇటీవల ఒక రోబో ఆత్మహత్య చేసుకుంది. పని ఒత్తిడితోనే అది ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. దక్షిణ కొరియాలోని గుమీ సిటీ కౌన్సిల్ జూన్ 26న తమ ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ‘సైబోర్గ్’ రోబో ఆరున్నర అడుగుల ఎత్తైన మెట్లపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. ఈ దుర్ఘటన జరగడానికి ముందు ఆ రోబోను ఒక అధికారి ‘ఒకే ప్రదేశంలో ప్రదిక్షిణలు చేస్తున్నట్లు’ గమనించాడు. ఇప్పుడు ఆ రోబో మరణం నిజంగా ఆత్మహత్యేనా? లేక సాంకేతిక లోపమా? అన్న విషయమై సోషల్ మీడియాలో వాదనలు ప్రారంభమయ్యాయి. 2023 ఆగస్టులో సిటీ కౌన్సిల్ ఆఫీసర్ గా ఎంపికైన ఈ రోబో లిఫ్ట్ ద్వారా తనంతట తానుగా అంతస్తుల మధ్య కదలగలదు.
’సైబోర్గ్‘ (CYBORG) రోబో (ROBOT) మరణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోందని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. సైబోర్గ్ ఎందుకు ఆ పని చేసిందనే కోణంలో రోబో మృతిపై దర్యాప్తును వెంటనే ప్రారంభిస్తామని గుమీ సిటీ అధికారులు తెలిపారు. ఆ రోబో ముక్కలను సేకరించామని, వాటిని కంపెనీ విశ్లేషిస్తుందని చెప్పారు.
ఈ రోబో (ROBOT) ను కాలిఫోర్నియాకు చెందిన రూట్ స్టార్టప్ బేర్ రోబోటిక్స్ (ప్రధానంగా రెస్టారెంట్ సర్వింగ్ రోబోట్లకు ప్రసిద్ధి చెందింది) ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్ అధికారిగా నియమించారు. ఇది ‘‘రోజువారీ డాక్యుమెంట్ డెలివరీలు, సిటీ ప్రమోషన్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అందించడంలో సహాయపడుతుంది’’ అని ఒక అధికారి చెప్పారు. ఇతర రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసే ఈ ఉద్యోగికి సివిల్ సర్వీస్ ఆఫీసర్ కార్డు కూడా ఉంది.
మరో అధికారి మాట్లాడుతూ ఈ సైబోర్గ్ రోబో 'శ్రద్ధగల' ఉద్యోగి అని చెప్పారు. ప్రస్తుతానికి గుమీ సిటీ కౌన్సిల్ మరో రోబో అధికారిని తీసుకురావాలని భావించడం లేదు. దక్షిణ కొరియా రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకునే దేశంగా ప్రసిద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక రోబోలు ఉన్న దేశం దక్షిణ కొరియానే. ఇక్కడ ప్రతి పది మంది మానవ ఉద్యోగులకు ఒక పారిశ్రామిక రోబో ఉంది.
మానవీయత కరువవుతున్న తరుణంలో, చోటు చేసుకున్న ఈ సంఘటనపై ఇప్పటికే అనేక వాదనలు వినిపిస్తున్నాయి. "పని ఒత్తిడి" కారణంగా సైబోర్గ్ రోబో ఆత్మహత్య చేసుకుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించిన 2004 సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఐ, రోబో సినిమాను ఈ ఘటన గుర్తు చేస్తుంది. అందులో ఒక అధునాతన రోబో ‘కలలు కనడం’ అనే మానవ చర్యను అనుభవిస్తుంది. రోబోటిక్ ముఖానికి సజీవ చర్మ కణజాలాన్ని జోడించే మార్గాన్ని ఇటీవల జపాన్ పరిశోధకులు కనుగొన్నారు.
టాపిక్