Doctor Suicide: నెల్లూరులో వైద్యురాలి ఆత్మహత్య… విశాఖలో చిన్నారిపై లైంగిక దాడి-suicide of a doctor in nellore sexual assault on a child in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Doctor Suicide: నెల్లూరులో వైద్యురాలి ఆత్మహత్య… విశాఖలో చిన్నారిపై లైంగిక దాడి

Doctor Suicide: నెల్లూరులో వైద్యురాలి ఆత్మహత్య… విశాఖలో చిన్నారిపై లైంగిక దాడి

HT Telugu Desk HT Telugu
Published Jul 02, 2024 10:06 AM IST

Doctor Suicide: నెల్లూరులో మెడికల్ కాలేజీ భవనం పై నుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల్లో ఉండగా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

నెల్లూరులో ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య
నెల్లూరులో ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య

Doctor Suicide: మెడికల్ కాలేజీ భ‌వ‌నం నుంచి దూకి ప్ర‌భుత్వ వైద్యురాలు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న నెల్లూరులో క‌ల‌కలం సృష్టించింది. చేజ‌ర్ల మండ‌లం చిత్త‌లూరు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో వైద్యురాలిగా ఎన్‌.జ్యోతి విధులు నిర్వ‌హిస్తున్నారు. ఆమె భ‌ర్త డాక్ట‌ర్ ర‌విబాబు నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పటల్ (జీజీహెచ్‌)లో ఆర్థోపెడిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా నిర్వ‌ర్తిస్తున్నారు. తెలంగాణ‌లోని న‌ల్గొండ‌కు చెందిన ఎన్‌. జ్యోతి (38)కి, నెల్లూరుకు చెందిన ర‌విబాబుతో 2014లో వివాహం అయింది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది.

వీరు నెల్లూరులోని నారాయ‌ణ ఆసుప‌త్రి స‌మీపంలో నివాసం ఉంటున్నారు. సోమ‌వారం ప్ర‌భుత్వ మెడికల్ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న క్యాన్స‌ర్ వ్యాధి స్క్రీనింగ్‌ పై అవ‌గాహ‌న‌, శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి ఇతర పీహెచ్‌సీ డాక్టర్స్ తో కలిసి జ్యోతి హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు అంత బాగానే ఉన్నారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశారు. అనంత‌రం ఆమెకు ఫోన్ రావ‌డంతో ఫోన్ మాట్లాడుతూ వైద్య క‌ళాశాల ఒక‌టో అంత‌స్తు నుంచి నాలుగో అంత‌స్తుకు వెళ్లారు.

కొద్ది సేప‌టికే హ‌ఠాత్తుగా కింద ప‌డిపోయారు. ఆమె నాలుగో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆమెకు వైద్యులు త‌క్ష‌ణ‌మే సీపీఆర్ చేశారు. అనంత‌రం అత్య‌వ‌స‌ర విభాగానికి త‌ర‌లించి చికిత్స అందించారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. జాతీయ వైద్యుల దినోత్స‌వం రోజునే ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం విషాదం నింపింద‌ని వైద్య క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ వ‌సుంధ‌ర, తోటి డాక్ట‌ర్లు అంటున్నారు. విచార‌ణలో భాగంగా ఆమె భ‌ర్త డాక్ట‌ర్ ర‌విబాబును పోలీసులు విచారిస్తున్నారు. వైద్యురాలి జ్యోతి మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి త‌ర‌లించారు.

విశాఖలో దారుణం, చాక్లెట్లు ఎర చూపి బాలికపై అత్యాచారం

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరం జ‌రిగింది. చిన్నారిపై 19 ఏళ్ల యువ‌కుడు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఆ నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. చాక్లెట్ ఎర చూపి, మేడ‌పైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేయ‌డంతో ఆ చిన్నారి ఉక్కిరిబిక్కిరి అయింది. భ‌యంతో ఏడ్చింది. క‌డుపునొప్పింటూ వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో త‌ల్లిదండ్రులు ఆరా తీయ‌గా ఆ చిన్నారి జ‌రిగింది వివ‌రించింది.

ఈ అమాన‌వీయ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా మ‌ధువాడ ప‌రిధిలోని మ‌ల్ల‌య్యపాలెం స‌మీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. జీవీఎంసీ ఏడో వార్డు మ‌ల్ల‌య్య పాలెనికి చెందిన సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేస్తున్న పోలిప‌ల్లి మోహ‌న్ పెద్ద కుమారుడు పోలిప‌ల్లి త‌రుణ్ (19) ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసి డిగ్రీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఇచ్చాడు. ఆ త‌రువాత వారు ఉంటున్న మేడ‌పైకి తీసుకెళ్లాడు. అక్క‌డ ఎవ‌రూ లేర‌ని భావించి ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు.

కుటుంబ స‌భ్యులతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి సిద్థం అయ్యారు. కానీ త‌మ కుమార్తె క‌నిపించ‌టం లేదు. దీంతో త‌ల్లిదండ్రులు కుమార్తెను చుట్టుపక్క‌ల వెదుకుతున్న క్రమంలో మేడపై నుంచి వస్తూ కనిపించింది. బాలిక తీవ్ర ఆందోళనతో కనిపించడం, ఏడుస్తుండటంతో ఏమి జరిగిందని నిందితుడిని నిలదీయడంతో అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో త‌ల్లిదండ్రులు పీఎం పాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి పీఎం పాలెం సీఐ రామ‌కృష్ణ చేరుకుని ప్రాథ‌మిక విచార‌ణ చేసి కేసు న‌మోదు చేశారు. అనంతరం దిశ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

(రిపోర్టింగ్ జగదీశ్వరరావు, హెచ్‌టి తెలుగు)

Whats_app_banner