Delivery day anxiety: డెలివరీ డేట్ దగ్గరికి రాగానే ప్రసవం గురించి భయాలు మొదలయ్యాయా? మీ మదిలోని ప్రశ్నలకు మా సమాధానాలు..
Delivery day anxiety: ప్రసవం గురించి, పురిటి నొప్పుల గురించి అనేక సందేహాలు, ప్రశ్నలు తల్లి కాబోతున్న స్త్రీ మనసులో మెదులుతూ ఉంటాయి. వాటినుంచి ఎలా బయపడాలో తెల్సుకోండి.
డెలివరీ డేట్ దగ్గరికి వస్తోందంటే ప్రసవం గురించి భయం మొదలయిపోతుంది. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమైనా అవాంతరాలొస్తాయా? అంతా సక్రమంగానే అవుతుందా లేదా.. ఇలా ఇంకా చాలా భయాలు కాబోతున్న అమ్మ మనసులో మెదులుతుంటాయి.

నొప్పి భరించగలనా లేదా?
మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు పురిటి నొప్పుల గురించి చెబుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అనుభవం ఉంటుంది. కొందరికి చాలా నొప్పులు అనుభవించాక, చాలా సేపటికి ప్రసవం అయితే.. మరి కొందరికి చాలా తక్కువ సమయంలోనే సుఖ ప్రసవం అవుతుంది. ఇవన్నీ వినడం వల్ల మనకెలా జరుగుతుందో అనే భయం మొదలవుతుంది. నొప్పిని భరించడం మన వల్ల అవుతుందా లేదా అనే సందేహమూ మొదలవుతుంది.
ఒక్కటి గుర్తుంచుకోండి.. మీరు నొప్పి అనుభవించేది మంచి కోసం.. మీకు జరగబోయే మంచికోసం. ఇది కష్టం వల్ల వచ్చిన నొప్పి కాదు. సుఖం కోసం, సంతోషం కోసం మీరు అనుభవిస్తున్న నొప్పి. నొప్పుల తర్వాత మీ ముందు పండంటి బిడ్డ ఉంటుంది. ఒకరోజు మొత్తం మీది కాదనుకోండి. నొప్పులు భరించాల్సిందేనని, మరో మార్గం లేదని మానసికంగా సిద్ధం అవ్వండి. ఆ రోజు తర్వాత మిగతావన్నీ మంచి రోజులే. నొప్పులు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ మీరు అస్సలు భరించలేనంత ఉంటాయనే భ్రమలో నుంచి బయటకు రండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఇది మీకు మీరు పెట్టుకుంటున్న చాలెంజ్ అనుకోండి. డెలివరీ నార్మల్ అయినా, సిజేరియన్ అయినా ఏదీ సులభం కాదు. అన్నింటిని మానసికంగా ఎదుర్కోడానికి సిద్ధం కండి.
హాస్పిటల్ చేరుకోలేమనే భయం:
సరైన సమయానికి ఆసుపత్రి చేరుకోలేక ఆటోలోనే, కార్లోనే డెలివరీ అయపోయారు అనే వార్తలు, కొన్ని సంఘటనలు చూసి మనలోనూ ఏ మూలనో అలాంటి భయం మొదలవుతుంది. కానీ వెయ్యి మందిలో ఒక్కరికి కూడా అలా జరగదు. చాలా తక్కువ సందర్భాల్లో, అనుకోని పరిస్థితుల్లో మాత్రమే అలాంటి ఘటనలు జరుగుతాయి. కాబట్టి దాని గురించి భయపడకండి. మీకు డెలివరీకి సంబంధించి ఏవైనా సూచనలు కనిపిస్తే వాటిని అలక్ష్యం చేయకండి. వెంటనే ఆసుపత్రికి బయలు దేరితే సరిపోతుంది.
డాక్టర్‌తో మాట్లాడండి:
మీరు ఎంచుకున్న ఆసుపత్రి గురించి పూర్తిగా తెల్సుకోండి. ఏ సమయంలో అయినా సేవలు అందించే సదుపాయం ఉండాలి. వైద్యులు, ఆసుపత్రి సేవలు 24X7 అందుబాటులో ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే ఎంచుకోండి. లేదంటే చివరి నిమిషంలో ఆసుపత్రి మారడం లాంటి అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
డెలివరీ సులభం అవ్వాలంటే..
ముందుగా సినిమాల్లో చూసో, ఆనోటా ఈ నోటా విన్న మాటల వల్లనో మీమీద మీరు నిగ్రహం కోల్పోకండి. నొప్పులు మొదలు కాగానే కేకలు పెట్టడానికి, ఏడవటానికి మీ శక్తి వృథా చేసుకోకండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి. దానికోసం ముందుగానే కొన్ని శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. మీ భాగస్వామితో మర్దనా చేయించుకోవడం లాంటివి చేయండి. కాస్త ప్రశాంతంగా ఉంటుంది.
అలాగే లేబర్ గదిలోకి వెళ్లాక నిలబడి ఉండటానికి ప్రయత్నం చేయండి. అటూ ఇటూ నడవటం, డాక్టర్ సలహా మేరకు స్వ్కాట్స్ లాంటివి చేయడం, బాల్ మీద వ్యాయామాలు చేయడం.. ఇలా మీరు చేయగలిగినన్నీ చేయండి. మీలో ఉన్న శక్తంతా కూడగట్టుకోండి. మీరెంత ధైర్యంగా ఈరోజును ఎదుర్కుంటే సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సాఫీగా అయిపోతుంది. ఇంకే భయాలు పెట్టుకోకండి.
టాపిక్