One Nation One Election: జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం; శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు
దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
One Nation One Election: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. భారతదేశం వ్యాప్తంగా లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక (One Nation One Election)’ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.
రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ లోక్ సభ ఎన్నికల ప్రకటనకు ముందు మార్చి నెలలో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికిి సమర్పించింది. ఆ నివేదికపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించి, జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
శీతాకాల సమావేశాల్లో బిల్లు..
రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను కేబినెట్ ముందు ఉంచడం న్యాయ మంత్రిత్వ శాఖ 110 రోజుల ఎజెండాలో భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల వనరులను ఆదా చేయడం, అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడం, 'భారత్ అంటే భారత్' ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని కోవింద్ కమిటీ పేర్కొంది.
కమిటీ సిఫారసులు
రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి కామన్ ఓటరు జాబితా (voter list), ఓటరు గుర్తింపు కార్డులను భారత ఎన్నికల సంఘం (ECI) రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లోక్ సభ (Lok sabha), అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ (election commission of india) బాధ్యత వహిస్తుండగా, మున్సిపాలిటీలు, పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ లు నిర్వహిస్తున్నాయి.
కోవింద్ కమిటీ నివేదికలో ఏముంది?
బుధవారం క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టిన కోవింద్ కమిటీ నివేదికలో ఏకకాలంలో ఎన్నికల అమలుకు సమగ్ర రోడ్ మ్యాప్ ను పొందుపరిచారు. మొదటి విడతగా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ 18 రాజ్యాంగ సవరణలను సిఫారసు చేసింది, వీటిలో చాలావరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. అయితే వీటికి కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి మద్దతుదారుగా ఉన్నారు. తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశ ప్రగతికి ఆటంకం కలుగుతోందని, ఈ అంతరాయానికి ముగింపు పలకాలని ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ పిలుపునిచ్చారు. ‘ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోసారి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి పని ఎన్నికలతో ముడిపడి ఉంటుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.
బీజేపీ మేనిఫెస్టోలో కూడా..
భారతీయ జనతా పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విధానాన్ని కీలక అంశంగా పేర్కొంది. ఈ ప్రతిపాదనకు బీజేపీలోని పలువురి నుండి మద్దతు లభించినప్పటికీ, ఇతర రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏకకాల ఎన్నికలతో భారతదేశ ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం జమిలి ఎన్నికల లక్ష్యం. దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక భారం, పరిపాలనా భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. సింగిల్ ఓటరు జాబితా, సింగిల్ ఓటర్ ఐడీ కార్డుకు సంబంధించి ప్రతిపాదించిన కొన్ని మార్పులకు కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఈ అంశంపై లా కమిషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే తన సొంత నివేదికను విడుదల చేయనుంది.