AP MPs In Parliament: సైకిల్‌పై పార్లమెంటు ప్రాంగణానికి… తెలుగులో ఎంపీల ప్రమాణం-mps oath in telugu in parliament and vizianagaram mp went on cycle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mps In Parliament: సైకిల్‌పై పార్లమెంటు ప్రాంగణానికి… తెలుగులో ఎంపీల ప్రమాణం

AP MPs In Parliament: సైకిల్‌పై పార్లమెంటు ప్రాంగణానికి… తెలుగులో ఎంపీల ప్రమాణం

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 05:30 PM IST

AP MPs In Parliament: తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లారు.

సైకిల్‌పై పార్లమెంటుకు బయల్దేరిన విజయనగరం ఎంపీ
సైకిల్‌పై పార్లమెంటుకు బయల్దేరిన విజయనగరం ఎంపీ

AP MPs In Parliament: 18వ లోక్‌స‌భ స‌మావేశాలు తొలి రోజు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. నూతనంగా పార్ల‌మెంట్‌కు ఎన్నికై ఎంపీ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మంలో తెలుగు ఎంపిలు ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. కొంత మంది పంచ‌క‌ట్టుతోనూ, మ‌రికొంత మంది తెలుగులోనూ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఒక ఎంపీ ఏకంగా పార్ల‌మెంట్‌కు సైకిల్‌పై వ‌చ్చారు.

తొలిసారి లోక్‌స‌భ‌లో అడుగుపెట్టిన విజ‌య‌న‌గరం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు వినూత్నంగా పార్లమెంట్‌కు హాజ‌ర‌య్యారు. ప‌సుప రంగు కుర్తా, పైజామాతో ప‌సుపు రంగు సైకిల్ ఎక్కి ఢిల్లీ వీధుల్లో తొక్క‌కుంటూ పార్ల‌మెంట్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసం నుంచి ఆయ‌న సైకిల్‌పైనే పార్ల‌మెంట్‌కు చేరుకున్నారు. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణీయంగా సైకిల్‌పై వెళ్తుంటే ఢిల్లీ వీధుల్లో అంద‌రూ ఆయ‌న‌వైపే చూస్తున్నారు. అలాగే పార్ల‌మెంట్‌లో కూడా ప‌లువురు ఎంపీలు ఆయ‌న‌వైపే చూశారు.

మ‌రోవైపు లోక్‌స‌భ‌లో ప్రొటెం స్పీక‌ర్ భ‌ర్తృహ‌రి మెహ‌తాబ్ కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. తొలిత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌గా, త‌రువాత ప్రొటెం స్పీక‌ర్ల ప్యానెల్ స‌భ్యులు కొడికున్నిల్ సురేష్, టీఆర్ బాలు, రాధామోహ‌న్ సింగ్‌, ఫ‌గ్గ‌న్ సింగ్ కుల‌స్తే, సుదీప్ బందోపాధ్యాయ‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం కేంద్ర మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఆ త‌రువాత రాష్ట్రాలకు చెందిన స‌భ్యుల‌ను అక్ష‌ర క్ర‌మంలో ప్ర‌మాణ స్వీకారం కొన‌సాగింది.

తెలుగులో ప్ర‌మాణ స్వీకారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎంపీల్లో కొంత మంది తెలుగులో ప్ర‌మాణ స్వీకారం చేసి ప్ర‌త్యేకంగా నిలిచారు. కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు కె. రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపి భూప‌తి రాజు శ్రీ‌నివాస‌వ‌ర్మ, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు జీ.కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లు తెలుగులో ప్ర‌మాణ స్వీకారం చేశారు.

టీడీపీ ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, ఎం.శ్రీ‌భ‌ర‌త్‌, కేశినేని చిన్ని, లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు తెలుగులో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీ ఎంపీ పురందేశ్వ‌రి, జ‌న‌సేన ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి తెలుగులో ప్ర‌మాణ స్వీకారం చేశారు. మిగిలిన 19 మంది ఎంపీలు ఇంగ్లీష్‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు.

పంచ‌క‌ట్టుతో ప్ర‌మాణ స్వీకారం

తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు స‌భ్యులు పంచ‌క‌ట్టుతో ప్ర‌మాణ స్వీకారం చేశారు. తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జీ.కిష‌న్ రెడ్డి పంచ‌క‌ట్టుతో ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌ర‌య్యారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విజ‌య‌న‌గ‌రం ఎంపి క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు కూడా పంచ‌క‌ట్టుతోనే ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరిద్ధ‌రూ పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించారు. సాధార‌ణంగా కేర‌ళ‌, త‌మిళ‌నాడు ఎంపీలు పంచ‌క‌ట్టుతోనే పార్ల‌మెంట్‌కు హాజ‌ర‌వుతారు. తెలుగు రాష్ట్రాలు ఎంపీలు పంచ‌క‌ట్టుతో హాజ‌ర‌వ్వ‌డం అతి త‌క్కువ‌గా ఉంటుంది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel