Monsoon: దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడంపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ
2024లో భారత్ లోకి రుతు పవనాలు ప్రవేశించే తేదీలకు సంబంధించి భారత వాతావరణ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. సాధారణంగా రుతుపవనాలు మొదట కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం మే 31న రుతు పవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ వెల్లడించింది. జూన్, సెప్టెంబర్ నెలల మధ్య దేశంలో 70% వర్షపాతాన్నిఇవి అందిస్తాయి.
Monsoon news: నైరుతి రుతుపవనాలు మే 31 న షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే భారత ప్రధాన భూభాగంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి రుతుపవనాలు భారత్ లో వ్యవసాయానికి అత్యంత కీలకమైనవి. ఇది చాలా మంది భారతీయ రైతుల జీవనోపాధి వీటిపై ఆధారపడి ఉంటుంది. ఇవి ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతాయి.
జూన్ 1న కాదు.. మే 31 ననే
సాధారణంగా నైరుతి రుతుపవనాలు (Monsoon) కేరళలోకి జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం కూడా జూన్ 1 వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని గతంలో ఐఎండీ తెలిపింది. తాజాగా, జూన్ 1 కన్నా ఒక రోజు ముందుగానే, అంటే మే 31వ తేదీననే రుతుపవనాలు భారత్ లో ప్రవేశిస్తాయని వెల్లడించింది. అయితే, వాతావరణ పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు భారత్ లోకి ఎంటర్ అవుతాయని తెలిపింది.
ఐఎండీ అంచనాలు ఎప్పుడూ కరెక్టే
2015లో మినహా గత 19 ఏళ్లలో (2005-2023) రుతుపవనాలు ప్రవేశించే తేదీపై ఐఎండీ అంచనాలు సరైనవి గానే తేలాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 8 న సాధారణం కంటే ఒక వారం ఆలస్యంగా వచ్చాయి. ఐఎండీ జూన్ 4 న +/- 4 రోజుల తేడాతో వస్తాయని అంచనా వేసింది. జూన్-సెప్టెంబర్ మధ్య దేశంలో దాదాపు 70% వర్షపాతాన్ని అందించే నైరుతి రుతుపవనాలు భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సగటు (LPA) లో 106% వద్ద "సాధారణం కంటే ఎక్కువ" వర్షపాతం ఉండే అవకాశం ఉందని ఐఎండీ ఏప్రిల్ 15 న తన దీర్ఘకాలిక అంచనాలో తెలిపింది.
లా నినా వల్ల అధిక వర్షాలు
గత వారం, అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఈ సంవత్సరం లా నినా (La Nina) దృగ్విషయం ప్రారంభమవుతుందని, దీని ఫలితంగా భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ రుతుపవన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వ్యవసాయానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి సమృద్ధిగా రుతుపవన వర్షాలు కురవడం కీలకం. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశం వ్యవసాయ విస్తీర్ణంలో 51%, ఉత్పత్తిలో 40% వర్షాధారంగా ఉంది. దేశ జనాభాలో 47% మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు మే 19 నాటికి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం అంచనా వేసింది.
జులై 15 నాటికి దేశవ్యాప్తం
రుతుపవనాలు ఉత్తరం వైపుకు పురోగమిస్తున్నప్పుడు మండే వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా జూలై 15 నాటికి దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి.