Assembly polls: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న ఐఎన్ఎల్డీ, బీఎస్పీ
Assembly polls: త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఒక అవగాహన కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేయనుంది.
Haryana Assembly polls: ఈ ఏడాది చివర్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన మాజీ మిత్రపక్షం బహుజన్ సమాజ్ పార్టీతో మరోసారి చేతులు కలపాలని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్ణయించినట్లు రెండు పార్టీల నాయకులు గురువారం ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేయనుంది.మిగిలిన స్థానాలను హర్యానాలో తన సీనియర్ భాగస్వామ్య పక్షం అయిన ఐఎన్ఎల్డీకి అప్పగించింది. మరోవైపు, హర్యానాలో అధికార బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది.
అధికారం మనదే
చండీగఢ్ శివార్లలోని నయాగావ్ లో బీఎస్పీ నాయకులతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కూటమి ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడలేదని, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశామని చెప్పారు. ‘పేదలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, బలహీన వర్గాలకు ఎలా సాధికారత లభిస్తుందనేది బీఎస్పీ, ఐఎన్ఎల్డీ ఆలోచన’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
2019 లో తెగతెంపులు
కూటమి ఏర్పాటుకు సంబంధించి ఇటీవల బీఎస్పీ అధినేత్రి మాయావతి, అభయ్ చౌతాలా సుదీర్ఘంగా సమావేశమయ్యారని బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ తెలిపారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి హర్యానా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఐఎన్ఎల్డీతో దాదాపు తొమ్మిది నెలల పొత్తును బీఎస్పీ రద్దు చేసుకుంది. చౌతాలా కుటుంబంలో విభేదాల నేపథ్యంలో అప్పట్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.