Telangana Assembly Elections 2023: బీఎస్పీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. దళితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వారిని చిన్న చూపు చూస్తూ, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, రాజకీయంగా అణగతొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అణిచివేతకు గురైన వర్గాలకు విద్య,ఉద్యోగ,రాజకీయ అవకాశాలు వచ్చాయని అన్నారు.
మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా మన్యశ్రీ కాన్షీరామ్ ఉద్యమం చేయడం వల్లే ఓబిసిలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయన్నారు.1989లో మొదటిసారి తను ఎంపీగా గెలిచాక నాటి వీపీ సింగ్ ప్రభుత్వం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే మంత్రి పదవి వద్దు, మండల కమిషన్ అమలు చేయాలని వి.పి సింగ్ ప్రభుత్వం మెడలు వంచి దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయించామని గుర్తు చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ కు భారతరత్నను ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. బి.ఆర్ అంబేద్కర్,మాన్యశ్రీ కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించలేదని కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. దేశంలో బీఎస్పీ అధికారంలోకి వేస్తేనే ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు సెక్టార్ లో రిజర్వేషన్లు లేవన్నారు మాయావతి. దీంతో దేశవ్యాప్తంగా ఓబీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్,బిజెపిల పాలనలో బహుజన వర్గాలకు న్యాయం జరగలేదన్నారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం దక్కలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితుల పక్షాన పోరాడుతున్నట్టు బయటకు కనిపిస్తున్నా, కేసీఆర్ మాత్రం దళిత వ్యతిరేకని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలిస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితుల పక్షపాతి అని చెప్తూనే దళిత వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై,అతని కుమారునిపై పునీత్ పై పోలీసులు అక్రమంగా తప్పుడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు అమలు చేస్తుందని అన్నారు. దేశంలో లంచగొండితనం పెరిగిపోయిందని అన్నారు.
యూపీలో బీఎస్పీ నాలుగు సార్లు అధికారంలోకి వచ్చి భూమి లేని పేదలకు భూమి పంచి, లక్షలాదిమంది యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వస్తే అటువంటి పథకాలు అమలు చేసి బహుజన మహనీయులు కలలు కన్నా రాజ్యాన్ని నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్,బీజేపిలతో బీఎస్పీ ఒంటరిగా తలపడుతూ పోటీ చేస్తుందని అన్నారు. ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించి సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీనేనన్నారు.
రాష్ట్టాన్ని దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఏం సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజనుల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.