ఓం ప్రకాశ్ చౌతాలా.. 10th పాస్!
చదువుకు వయస్సుతో పని లేదంటారు. ఈ మాటను నిజం చేసి చూపించారు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏళ్ల వయస్సులో పదవ తరగతి, 12వ తరగతి పాసై రికార్డు సృష్టించారు. ప్రముఖుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు.
ఓం ప్రకాశ్ చౌతాలా. హరియాణాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. జాట్ నేత. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్‌డీ) చీఫ్. హరియాణా ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో ప్రముఖుడు. అన్నీ సాధించినా.. చదువు విషయంలో కొంత అసంతృప్తి ఆయనలో ఉండేది. తాజాగా, ఆ లక్ష్యాన్ని కూడా చేరుకున్నారు.
ఇంగ్లీష్ ఫెయిల్
2019లోనే ఆయన 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కానీ ఇంగ్లీష్ పేపర్ రాయలేకపోయారు. దానివల్ల ఆయన 12వ తరగతి పరీక్ష ఫలితాలను హరియాణా ఎడ్యుకేషన్ బోర్డ్ విత్‌హెల్డ్‌లో పెట్టింది. గత ఆగస్ట్ లో మళ్లీ 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాశారు. 88% మార్కులు సాధించి, విజయకేతనం ఎగరవేశారు. ఇప్పుడు 10th, 12th పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ సాధించి, యువతకు స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం మార్క్ షీట్స్‌ను చౌతాలాకు అందజేశారు. దాంతో, 87 ఏళ్ల చౌతాలకు దశాబ్దాలుగా ఉన్న కల నెరవేరినట్లయింది. వీర్ శిరోమణి మహారాణా ప్రతాప్ 428వ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన చౌతాలాకు అధికారులు ఈ పాస్ సర్టిఫికెట్ అందించారు.
`దస్‌వీ` సినిమా
ఓం ప్రకాశ్ చౌతాలా లక్ష్యం స్ఫూర్తిగా `దస్‌వీ` అనే సినిమా కూడా రూపొందింది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ నటించారు. చౌతాలా గతంలో ఒక రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో దోషిగా తేలి జైలుకు వెళ్లారు. జైలులో ఉండగానే 10 వ తరగతి పరీక్షలు రాశారు. చౌతాలా ప్రస్తుత విజయాన్ని ప్రముఖలు ప్రశంసిస్తున్నారు.
టాపిక్