Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం-haryana independent mlas withdraw support to bjp govt how numbers stack up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

HT Telugu Desk HT Telugu
May 08, 2024 12:03 PM IST

Haryana crisis: హరియాణాలోని బీజేపీ సర్కారు సంక్షోభంలో పడింది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దాంతో, బీజేపీ నేతృత్వంలో నయాబ్ సింగ్ సైనీ సీఎంగా ఉన్న ప్రభుత్వం మైనారిటీలో పడింది.

హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ
హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ

Haryana crisis: హరియాణాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. దాంతో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్ల సపోర్ట్ మాత్రమే ఉంది.

అసెంబ్లీలో సంఖ్యాబలం

హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. వాటిలో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మిగిలిన 88 సీట్లలో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 30, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 45 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీకి మద్ధతు ఇచ్చిన జేజేపీ.. ఆ తరువాత మద్దతు ఉపసంహరించుకుంది. ఇండిపెండెంట్ల మద్దతుతో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు తాజాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ కు సపోర్ట్

ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్ (దాద్రి), రణధీర్ సింగ్ గోలెన్ (పుండ్రీ), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి) రోహ్ తక్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, నయాబ్ సింగ్ సైనీ వెంటనే అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సీఎం సైనీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్ కు లేఖలు రాసినట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఉపసంహరించుకున్నారు?

రైతులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సహా వివిధ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యే ధరంపాల్ గోండేర్ తెలిపారు. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారని కాంగ్రెస్ నేత ఉదయ్ భాన్ తెలిపారు. నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వమని, సైనీకి ఒక్క నిమిషం కూడా సీఎంగా ఉండే హక్కు లేదని ఆయన అన్నారు. హర్యానాలో ఈ అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

హరియాణా అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు?

హరియాణా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

బీజేపీ: 40 మంది ఎమ్మెల్యేలు

స్వతంత్రులు: ఏడుగురు ఎమ్మెల్యేలు

జననాయక్ జనతా పార్టీ (జేజేపీ): 10 మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్: 30 మంది ఎమ్మెల్యేలు

హరియాణా లోక్ హిత్ పార్టీ (హెచ్ఎల్పీ): 1 ఎమ్మెల్యే

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ): 1 ఎమ్మెల్యే

కాంగ్రెస్ హర్యానా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా?

ప్రస్తుతం హరియాణా అసెంబ్లీలో కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆ పార్టీ బలం 33కి చేరింది. మెజారిటీ మార్కుకు 13 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు.

తరువాత ఏమి జరుగుతుంది?

హరియాణాలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ సాధారణంగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతిపెద్ద పార్టీ నేతకు ఆహ్వానం పలుకుతారు. ప్రస్తుతం అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది. అందువల్ల గవర్నర్ 10 రోజుల గడువు విధించి, మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉంది.