Fodder scam | దాణా కుంభకోణంలో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
Fodder scam | పశు దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది.
రాంచీ: రూ. 139.5 కోట్ల మేర డొరండా ట్రెజరీ దుర్వినియోగం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది. అయితే శిక్ష కాలాన్ని ఫిబ్రవరి 18న ప్రకటిస్తుందని సీబీఐ న్యాయవాది తెలిపారు.
ఈ కేసులో వాదనలు విన్న కోర్టు జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసింది. దాణా కుంభకోణంలో నాలుగు కేసుల్లో లాలూ ప్రసాద్‌కు గతంలో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.
‘లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించారు. ఫిబ్రవరి 18న శిక్ష కాలాన్ని ప్రకటిస్తారు’ అని సీబీఐ న్యాయవాది తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్‌లో దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో ఒకటైన దుమ్కా ట్రెజరీకి సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేసింది.
2020 అక్టోబర్‌లో చైబాసా ట్రెజరీ కుంభకోణం కేసులో, ఫిబ్రవరి 2020లో డియోఘర్ ట్రెజరీ స్కామ్ కేసులో అతనికి ఇప్పటికే బెయిల్ మంజూరైంది.
లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 1991-1996 మధ్యకాలంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ట్రెజరీ నుంచి మోసపూరితంగా ఉపసంహరించారన్న అభియోగాలపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది.