Bengaluru crime news: పాపం మోనిక.. ఉద్యోగానికి వెళ్తూ, అనంత లోకాలకు.. బెంగళూరులో దారుణం-bengaluru woman dragged by cab after colliding with bmtc bus dies report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Crime News: పాపం మోనిక.. ఉద్యోగానికి వెళ్తూ, అనంత లోకాలకు.. బెంగళూరులో దారుణం

Bengaluru crime news: పాపం మోనిక.. ఉద్యోగానికి వెళ్తూ, అనంత లోకాలకు.. బెంగళూరులో దారుణం

Sudarshan V HT Telugu
Oct 09, 2024 03:17 PM IST

Bengaluru crime news: బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్లున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆ యువతి కింద పడిపోయింది. వెనకనే వస్తున్న ఒక క్యాబ్ ఆ యువతిపై నుంచి వెళ్లడమే కాకుండా, 40 అడుగుల వరకు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ యువతి స్పాట్ లోనే చనిపోయింది.

బెంగళూరులో ఘోర ప్రమాదం
బెంగళూరులో ఘోర ప్రమాదం

Bengaluru crime news: బెంగళూరులో ఒక ప్రైవేటు సంస్థలో చిరుద్యోగం చేస్తున్న ఒక యువతి బీఎంటీసీ (BMTC) బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బీఎంటీసీ బస్సు ఢీ కొని కింద పడిపోయిన ఆ యువతిపై నుంచి వెనుక నుంచి వేగంగా వస్తున్న క్యాబ్ వెళ్లింది. క్యాబ్ కింద చిక్కుకుపోయిన ఆ యువతిని క్యాబ్ దాదాపు 40 అడుగులు లాక్కు వెళ్లింది. ఈ ఘటనలో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి

మోనికా ఎస్ అనే 28 ఏళ్ల మహిళ బుధవారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో 80 అడుగుల రోడ్డులోని ఉల్లాల్ ఉపానగర్ సరస్సు సమీపంలో బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, బస్సు, క్యాబ్ డ్రైవర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఉల్లాల్ మెయిన్ రోడ్డులోని మారుతి నగర్ లో నివాసముండే మోనిక నగరభవిలోని రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలో జాబ్ చేస్తున్నారు. బుధవారం ఉదయం బైక్ పై ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్పాట్ డెడ్

మోనిక స్కూటర్ పై వెళ్తుండగా కెంగేరి నుంచి ముత్తనపాళ్య వైపు వెళ్తున్న బీఎంటీసీ బస్సు ఆమె వాహనాన్ని ఢీ కొట్టింది. స్కూటర్ పై నుంచి కిందపడగానే బస్సు వెనకే వస్తున్న క్యాబ్ ఆమెపైకి దూసుకెళ్లి సుమారు 40 అడుగుల దూరం ఈడ్చుకెళ్లి ఆగిపోయింది. మోనిక తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నగరంలోని నీటి సరఫరా సంస్థ అయిన బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) చేపట్టిన పైపులైన్ పనుల కారణంగా ఈ రహదారి ఇరుకుగా మారిందని, ఈ ప్రమాదానికి ఇది కూడా ఒక కారణమని స్థానికులు తెలిపారు. బస్సు, క్యాబ్ డ్రైవర్ల అతివేగం ఆ యువతి మరణానికి ప్రధాన కారణమని తెలిపారు.

డ్రైవర్ల అరెస్ట్

ఈ దుర్ఘటనలో బీఎంటీసీ బస్సు డ్రైవర్ సురేష్, క్యాబ్ డ్రైవర్ శరణ్ ప్రసాద్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీడబ్ల్యూఎస్ఎస్బీ అధికారుల పేర్లను దర్యాప్తులో చేర్చారు. ప్రైవేట్ ఉద్యోగి రాజ్ కుమార్ ను పెళ్లాడిన మోనికకు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఘటన తీవ్రతపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో మెరుగైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Whats_app_banner