ONGC Gas Leak in Konaseema : కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ కావటం ఇందుకు కారణమైంది. బోరు బావి నుంచి గ్యాస్ లీకవటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. శివకోడుకు చెందిన రైతు ఆక్వా చెరువు కోసం బావి తవ్వించటంతో భూమి లోపల ఉన్న ఓఎన్‌జీసీ పైపులైను దెబ్బతినడంతో గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది… మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు. రైతు వేయించిన బోరు… గ్యాస్ పైపులైన్ కు తాకటం వల్ల దెబ్బతిని గ్యాస్ లీక్ అవుతుందా…? లేక భూమి పోరల్లో నుంచి మంటలు వస్తున్నాయా..? అన్నది తేలాల్సి ఉంది. నిపుణులను ఘటనాస్థలికి రప్పించనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గ్యాస్ లీక్ అవుతున్న ప్రాంతం నుంచి గ్రామాలు దూరంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో కూడా కోనసీమ జిల్లా పరిధిలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటనలు ఉన్నాయి. చాలా గ్రామాల మీదుగా ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వెళ్లటం… ఏదో ఒక చోట లీక్ కావటంతో… అగ్నిప్రమాదాలు జరిగాయి.