Nitin Gadkari : గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు.. రోడ్డు భద్రతపై నితిన్ గడ్కరీ-53 accidents 19 deaths each hour nitin gadkari raises alarm over road safety details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitin Gadkari : గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు.. రోడ్డు భద్రతపై నితిన్ గడ్కరీ

Nitin Gadkari : గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు.. రోడ్డు భద్రతపై నితిన్ గడ్కరీ

Anand Sai HT Telugu
Sep 10, 2024 02:59 PM IST

Road Accidents In India : భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు భద్రతపై హెచ్చరించారు. దేశంలో సురక్షిత రోడ్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్ మెుదటిస్థానంలో ఉంది. ఇటీవలి సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల 64వ వార్షిక సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. వాహనదారులకు, పాదచారులకు రోడ్లను సురక్షితంగా చేసే చర్యల గురించి గడ్కరీ మాట్లాడారు. ప్రమాదాల ఉదంతాలను తగ్గించడానికి అందరూ చర్యలు తీసుకోవాలన్నారు.

దేశంలో అందరికీ సురక్షితమైన రోడ్లు ఉండాల్సిన అవసరాన్ని గడ్కరీ పదే పదే నొక్కి చెప్పారు. ఆటోమొబైల్స్ తయారీలో ఉన్నవారు స్థానిక నియమాలు, నిబంధనల గురించి తెలుసుకునేలా డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. 'మన దేశంలో ప్రతి గంటకు దాదాపు 53 ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల 45 శాతం, పాదచారుల వల్ల 20 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్యలను తగ్గించేందుకు కూడా సహకరించాలి. డ్రైవర్-ట్రైనింగ్ పాఠశాలలను ప్రారంభించేందుకు మీరందరూ ఆసక్తి చూపాలని నేను నిజంగా అభ్యర్థిస్తున్నాను. మంచి శిక్షణ ఇవ్వాలి. ఇది నిజంగా సానుకూల పరిష్కారం కావచ్చు.' అని గడ్కరీ చెప్పారు.

సరిగాలేని రోడ్ల నిర్మాణాలు, సంకేతాలపై తన శాఖ పని చేయడం ప్రారంభించిందని గడ్కరీ చెప్పారు. అదేవిధంగా సురక్షితమైన వాహనాల ఆవశ్యకతను కూడా కేంద్రమంత్రి నొక్కిచెప్పారు. భారత్ NCAP ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. 'భారత్ NCAP అనేది వినియోగదారులకు సురక్షితమైన వాహనాలను కలిగి ఉండటానికి, తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెడుతుంది.' అని చెప్పారు.

భారత్ NCAP(న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) అనేది ఇక్కడ మార్కెట్‌లో విక్రయిస్తున్న వాహనాలకు క్రాష్-సేఫ్టీ రేటింగ్‌లు. అత్యధిక భద్రతా రేటింగ్‌ను అందించే ఏ వాహనానికైనా ఇది కచ్చితమైన ఫైవ్-స్టార్ రేటింగ్‌ను అందజేస్తుంది. ఇది ప్రతి కారు మోడల్‌ను పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఆధారంగా రేట్ చేస్తుంది.