Yoga for Sexual Health । మీ లైంగిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే కొన్ని యోగాసనాలు!
Yoga for Sexual Health: మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ ఆసనాలు యోగాలో ఉన్నాయి. ఇవి మీ ఇంద్రియాలను ఉత్తేజం చేస్తాయి, ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేని ప్రశాంతమైన భావాలను మీలో కలిగిస్తాయి.
Yoga for Sexual Health: యోగా అనేది కేవలం ఒక రకమైన వ్యాయామం అనుకోవద్దు, ఇది అంతకుమించిన అభ్యాసం. యోగా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇది అంతులేని ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఒక సాధన. కడుపు ఉబ్బరాన్ని తగ్గించటానికైనా, దీర్ఘకాలిక వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికైనా, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికైనా లేదా ఆందోళన చెందుతున్న మనస్సును శాంతపరచడానికైనా ప్రతీ అవసరానికి, ప్రతి సమస్యకు చికిత్స చేసే శక్తి కోసం మీరు యోగా చేయవచ్చు. యోగాసనాలతో మీరు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సాధించవచ్చు.
ఇది మాత్రమే కాదు, యోగా మీ లైంగిక జీవితానికి గేమ్-ఛేంజర్‌గా కూడా మారవచ్చు. మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ ఆసనాలు యోగాలో ఉన్నాయి. ఇవి మీ ఇంద్రియాలను ఉత్తేజం చేస్తాయి, ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేని ప్రశాంతమైన భావాలను మీలో కలిగిస్తాయి. మీ మనస్సును, మీ ఆత్మను ఏకం చేసి మీరు పూర్తి ఏకాగ్రతతో, మరింత శక్తివంతంగా శృంగారం చేయటానికి మీకు సహాయపడతాయి. అలాంటి యోగాసనాలలో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.
చక్రవాకాసనం
చక్రవాకాసనం (Cat Pose) అనేది ఒక సున్నితమైన ఆసనం. ఇది వెన్నుభాగంలో కదలికను కలిగిస్తుంది, వెన్నెముకను సాగదీస్తుంది. ఈ భంగిమను సాధన చేయడం వల్ల మీ మొండెం, భుజాలు, మెడ కూడా సాగుతుంది. ఈ యోగాసనం సాధన చేయడం ద్వారా మీ వెన్నెముకను సున్నితమైన మసాజ్ లభించినత్లవుతుంది, తద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ఈ భంగిమ మీ పొత్తికడుపు వైపు రక్తప్రసరణ పెంచుతుంది. ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేస్తుంది. ఈ రకంగా మీ జననావయవాలకు సరైన రక్త ప్రసరణ జరిగి లైంగి శక్తిని ప్రేరేపిస్తుంది. ప్రతిరోజూ కనీసం ఒక నిమిషం పాటు చక్రావాకాసనం వేయండి. ఐదు సార్లు రిపీట్ చేయండి.
భుజంగాసనం
భుజంగాసనం (Cobra Pose) ప్రధానంగా మీ ఉదర భాగంపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రాంతంలో రక్త ప్రసరణకు సహాయపడుతుంది, వెన్నుముకను బలపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వెన్నునొప్పి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఈ యోగా భంగిమ పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ సహాయకారిగా ఉంటుంది. అలాగే లైంగిక ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరచడానికి ప్రామాణిక యోగా ఆసనాలలో ఇది ఒకటి.
వజ్రాసనం
వజ్రాసనం (Thunderbolt Pose/ Diamond Pose) పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, పోషణను అందిస్తుంది. ఈ ఆసనం సాధన చేయడం ద్వారా స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక అవయవాలను ఆరోగ్యవంతం చేస్తుంది. లైంగిక పనితీరును, శృంగార జీవితాన్ని మెరుగుపరచడంతో పాటు, పునరుత్పత్తి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సుమారు 5-10 నిమిషాలు ఈ భంగిమలో ఉండండి. బరువు పెరగడానికి ఇది గొప్ప యోగాసనం. ఇంకా మలబద్ధకాన్ని నివారణకు, ఆకలిని పెంచడానికి, మైరుగైన జీవక్రియ ప్రయోజనాలకు ఈ ఆసనం ఉత్తమమైనది.
ఉత్కట కోణాసనం
ఉత్కట కోణాసనం లేదా దేవత భంగిమ (Goddess Pose) అని కూడా పిలుస్తారు. ఉత్కట అంటే శక్తివంతమైనది, కోణా అంటే కోణం, ఆసనం అంటే భంగిమ. శక్తివంతమైన కోణం కలిగిన ఆసనం అనే అర్థం వస్తుంది, కాళీమాత భంగిమలో భీకరరూపంలో కనిపిస్తుంది కాబట్టి దీనిని దేవత భంగిమ అని పేరుతోనూ పిలుస్తారు. ఈ భంగిమ శక్తిసామర్థ్యాలను పెంచుతుంది, ముఖ్యంగా దిగువ శరీరాన్ని బలపరుస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది, మనస్సుకు ప్రశాంతతను తెస్తుంది. మరియు శరీరానికి విశ్వాసం మరియు బలాన్ని తెస్తుంది. ఉత్కట కోణాసనం గర్భిణీ స్త్రీలకు లేదా పిల్లలను ప్లాన్ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. (గర్భిణీలు మూడవ త్రైమాసికంలో చేయకూడదు) ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, పెల్విక్ ఫ్లోర్‌ను బలపరుస్తుంది
మీరు ఆసనం వేసినపుడు మీ మెడ మీ జననాంగాల కంటే కిందకు వంచినట్లుగా ఉండే ఏ యోగా భంగిమ అయినా మీ లైంగిక శక్తిని పెంచుతుందని యోగా నిపుణులు అంటున్నారు.
సంబంధిత కథనం