Yoga for Kidneys Health। కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి ఈ యోగాసనాలు సాధన చేయండి!
Yoga for Kidneys Health: మూత్రపిండాల పనితీరుకు, నిర్విషీకరణలో సహాయపడటానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి దోహదపడే 3 యోగాసనాలను ఇక్కడ తెలుసుకోండి.
Yoga for Kidneys Health: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు కూడా ఒకటి. రక్తం నుండి వ్యర్థాలు, టాక్సిన్‌లను ఫిల్టర్ చేయడం, లోపలి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వీటి ప్రధాన విధి. అదనంగా రక్తపోటును నియంత్రించడం, విటమిన్ డిని సక్రియం చేయడం, ముకల అభివృద్ధి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ను ఉత్పత్తి చేయడం వంటి వివిధ శారీరక విధులకు మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. అయితే.. అనారోగ్యపు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా మూత్రపిండాలపై పనిభారం పెరుగుతుంది, దీంతో అవి నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఇది వివిధ కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) సంభవిస్తుంది, ఇది శరీరంలో వ్యర్థాలు, అదనపు నీరు పేరుకుపోవడానికి దారితీస్తుంది. గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యలను సైతం కలిగిస్తుంది.
మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం, హైడ్రేటెడ్ గా ఉండటం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అక్షర యోగా సంస్థల వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ మాట్లాడుతూ పై చర్యలతో పాటు, కొన్ని యోగా ఆసనాలను అభ్యసించడం వలన మూత్రపిండాల పనితీరును మరింత మెరుగుపరుస్తుంది, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు.
మూత్రపిండాల పనితీరుకు, నిర్విషీకరణలో సహాయపడటానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి దోహదపడే 3 యోగాసనాలను ఆయన సూచించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
పశ్చిమోత్తనాసనం
విధానం: ఈ ఆసనం వేయడానికి ఒకచోట దండాసనంలో కూర్చోండి. మీ రెండు కాళ్లను ముందుకు చాచండి. మీ చేతులతో మీ కాళ్ల వేళ్లను పట్టుకొని, మీ తలను మీ మోకాళ్లకు తగిలేలా చేయండి. మీరు మీ చేతులను పైకి ఎత్తేటప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంచండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ముందుకు వంగి, మీ కాలి బొటనవేళ్లను మీ వేళ్లతో పట్టుకోవడానికి ప్రయత్నించండి.
లాభాలు:
• జీర్ణక్రియలో సహాయపడుతుంది, మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతుంది.
• ఉదర, కటి అవయవాలకు సరైన ఆకృతి ఇస్తుంది.
• ఋతు చక్రాలను సమతుల్యం చేస్తుంది.
• మెదడును ప్రశాంతపరుస్తుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.
• ఒత్తిడి, తేలికపాటి డిప్రెషన్, అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.
• కాలేయం, మూత్రపిండాలు, అండాశయాలు, గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తుంది.
• జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రుతుక్రమం, రుతుక్రమ అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
• తలనొప్పి, ఆందోళన, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
ధనురాసనం
విధానం: మీ కడుపుపై పడుకోవడం ద్వారా ప్రారంభించండి. ఒక చోట బోర్లాపడుకొని, ఆ తర్వాత మీ కాళ్లను మీ వీపు వైపు మడవండి, తర్వాత మీ చేతులతో మీ కాళ్ల చీలమండలను పట్టుకోడానికి ప్రయత్నించండి. మీ కడుపుపై భారం పడేలా పైకి చూస్తూ, మీ చేతులు, కాళ్ళను వీలైనంత ఎత్తుకు పైకి లేపండి. ఈ భంగిమలో కాసేపు ఉండండి.
లాభాలు:
• భుజాలను విస్తరిస్తుంది.
• ఉదర కొవ్వును కాల్చేస్తుంది.
• ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది.
• వెన్ను వశ్యతను మెరుగుపరుస్తుంది.
చక్రాసనం
విధానం: యోగా మ్యాట్ పై వెల్లకిలా పడుకోండి. మీ పాదాలను నేలపై ఉంచి, మీ మోకాళ్లను వంచి లేవడానికి ప్రయత్నించండి, అదే తరహాలో మీ చేతులను నేలపై ఆనించి లేవడానికి ప్రయత్నించండి. ఈ భంగిమలో మీ చేతులు, కాళ్లు నేలపై ఉండగా, మధ్యలో మీ శరీరం గాలిలో ఉంటుంది. ఇది మధ్యలో ఒక గుండ్రని చక్రాన్ని ఏర్పరుస్తుంది.
లాభాలు:
• ఛాతీని విస్తరిస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
• శరీరంలో ఒత్తిడి, టెన్షన్ తగ్గిస్తుంది.
• చేతులు, కాళ్ళ కండరాలను బలపరుస్తుంది.
• ఎండోక్రైన్ గ్రంధులను ప్రేరేపిస్తుంది, సరైన శరీర జీవక్రియను నిర్వహిస్తుంది.
• కాలేయం, ప్లీహము, మూత్రపిండాల ప్రక్రియలను ప్రేరేపిస్తుంది.
• రక్త శుద్ధి , ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఈ యోగా అభ్యాసాలను మీ దినచర్యలో చేర్చడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉప్పు, కొవ్వు పదార్ధాలను తక్కువ తినడం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, మీరు కిడ్నీ వ్యాధిని నివారించడంలో, మీ కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.
సంబంధిత కథనం