Improve Your Skills। నైపుణ్యం కలవాడే విజేత, మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు చిట్కాలు!
World Youth Skills Day 2023: ఈరోజు ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
Tips To Improve Your Skills: చదువు పూర్తవగానే ఇక మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు అని అనుకోవద్దు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, నేటి పోటీ ప్రపంచంలో ఎంత నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా తక్కువే అవుతుంది. జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా పురోభివృద్ధి సాధించాలంటే ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి, కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి.
మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మార్గాలను వెతకడం వ్యక్తిగత వృద్ధికి మొదటి మెట్టు. మిమ్మల్ని మీరు నవీకరించుకుంటూ ఉంటే మీ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు, ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవచ్చు, కెరీర్‌లో పురోగతి సాధించవచ్చు, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. మీరు కూడా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తుంటే ఆ ప్రక్రియకు సాధారణమైన కొన్ని దశలు ఉన్నాయి, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
1. మీ బలాలు, బలహీనతలను గుర్తించండి
మీరు మీ అభివృద్ధి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి, ముందుగా బలాలు, బలహీనతలను గుర్తించండి. మీరు వేటిలో మెరుగ్గా ఉన్నారు, ఎక్కడ వెనకబడి ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకోండి. ఎక్కడైతే మీరు లోటుగా ఉన్నట్లు భావిస్తున్నారో, ఏయే రంగాలలో ఇంకా మెరుగుపడాలని భావిస్తున్నారో వాటిపై దృష్టి సారించండి.
2. సరైన నైపుణ్యాలను ఎంచుకోండి
నైపుణ్యాల ఎంపిక కూడా చాలా కీలకం. మీరు మీ బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే, మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్న నైపుణ్యాలను ఎంచుకోవడంపై ఆలోచన చేయండి. మీరు మీ బలమైన నైపుణ్యాలపై పనిచేస్తూ వాటిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? లేక, బలహీనంగా ఉన్న నైపుణ్యాలను సానపెట్టాలనుకుంటున్నారా? లేక కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అనేది నిర్ణయించుకోండి. మీరు ఏ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఎంచుకున్నా, అది మీరు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి, మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి, మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి సహాయపడేదై ఉండాలి.
3. ఇతరుల అభిప్రాయాన్ని అడగండి
మీరు ఎంచుకున్న నైపుణ్యాలపై మీ అంచనా అంత కచ్చితమైనది కాకపోవచ్చు. కాబట్టి ఈ మార్గంలో మీ సందేహాలు తీర్చడానికి, అపోహలను తొలగించడానికి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో మాట్లాడండి, వారు మీకు ఏ నైపుణ్యాలను మెరుగుపరచాలని సిఫార్సు చేస్తారో అభిప్రాయాన్ని అడగండి
4. విమర్శలను స్వీకరించండి
మీ పనితీరు బాగాలేదని మీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని వ్యక్తిగత దాడిగా తీసుకోకండి, వారికి విరుద్ధంగా ప్రవర్తించకండి. బదులుగా, ఇతరులు వారు చెప్పేది వినండి, దానిపై చర్చించండి. ఇతరుల విమర్శలు, సూచనలను తార్కిక దృక్కోణం నుండి విశ్లేషించడానికి ప్రయత్నించండి. అవి సరైన పాయింట్‌ని హైలైట్ చేస్తున్నాయో లేదో చూడండి. మీరు నిజమేనని భావిస్తే ఆ విమర్శలను స్వీకరించి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోడానికి సిద్ధం కండి.
5. మీ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వండి
నైపుణ్యాలను నేర్చుకోవడమే కాదు, వీటిని సాధన చేయడం కూడా ముఖ్యమే. ఏ వస్తువునైనా ఉపయోగించకుండా ఉంటే అది కొంతకాలానికి తుప్పుపట్టడం, పనిచేయకుండా పోతుంది. నైపుణ్యం అయినా అంతే, మీరు వాడకుండా ఉంచే నైపుణ్యం సాధన చేయకపోతే కొంతకాలానికి నిరుపయోగంగా మారుతుంది. అప్పుడు నేర్చుకుని కూడా లాభం లేదు. కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్దిష్ట నైపుణ్యంలో నైపుణ్యం సాధించాలనుకుంటే, నిరంతరం శిక్షణ పొందాలి. ఉదాహరణకు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నారు, అప్పుడు ఎవరితో అయినా మాట్లాడితేనే, మీ భావాలను వ్యక్తపరిస్తేనే మీ స్కిల్స్ మరింత మెరుగుపడతాయి, ప్రాక్టీస్ లేకుంటే ఉన్న స్కిల్స్ కూడా పోతాయి.
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం
ఈరోజు ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (World Youth Skills Day 2023). ప్రపంచంలోని యువతలో నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన కార్యక్రమం ఇది. ఈ వేడుకను ప్రతీ సంవత్సరం జూలై 15న జరుపుతారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని, భవిష్యత్తు కోసం గొప్ప సమాజాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో వరల్డ్ యూత్ స్కిల్స్ డేను నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం