World Biryani Day 2022 | తింటే బిర్యానీనే తినాలి..నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
బిర్యానీ ప్రియులందరికీ శుభవార్త.. ఇకపై మనం ప్రతీ ఏడాదికి జూలై 3న బిర్యానీ దినోత్సవంగా జరుపుకోబోతున్నాం. దీంతో ఇకపై మరిన్ని కొత్తకొత్త బిర్యానీ రుచులు పరిచయం అవుతాయి. మన బిర్యానీలకు మంచి గుర్తింపు వస్తుంది.
ఎన్ని రుచులు ఉన్నా తిరుగులేని రుచి కలిగినదేదంటే అది బిర్యానీ. ఎన్ని రకాలుగా తిన్నా గొప్ప ఆత్మసంతృప్తి ఏది తినగా కలుగుతుందంటే అది బిర్యానీ. నీరు పోయకపోయినా, నారు పెట్టకపోయినా, కోడిని కోయకపోయినా.. మసాలా వేసి బిర్యానీ చేయకపోయినా అందరికీ బిర్యానీ తినే హక్కు ఉంది. ఇక నుంచి మనం ప్రతి ఆదివారం బిర్యానీనే తిందాం.. ఏ విందులో అయినా బిర్యానీనే వండుకుందాం అని ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. ఎందుకంటే ఈరోజు అనగా జూలై 03ను 'ప్రపంచ బిర్యానీ దినోత్సవం' (World Biryani Day 2022) గా ప్రకటించారు. 2022లో మనం మొట్టమొదటి బిర్యానీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన వంటకంగా నిలిచింది. పేదవాడైనా- రాజ్యాన్ని ఏలే రాజైనా బిర్యానీని ఇష్టపడని వారుండరు. ఈ గొప్ప రుచికరమైన వంటకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానానికి గుర్తుగా ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ 'దావత్ బాస్మతి రైస్' జూలై 3ను ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించింది.
రుచులయందు బిర్యానీ రుచే వేరయా!
మరి మన భారతదేశంలో ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బిర్యానీకి ఒక్కో టేస్ట్, అయినప్పటికీ రుచిలో దేనికదే ఎవరెస్ట్ అనేలా గొప్పగా ఉంటుంది. అందులోనూ మన హైదరాబాద్ దమ్ బిర్యానీకైతే ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ ఉంది.
ఇక కర్ణాటకలో దొన్నె బిర్యానీ, కలకత్తాలో ఆలూతో చేసే పక్కీ బిర్యానీ, లక్నోలోని అవధి బిర్యానీ, తమిళనాడులో అంబూర్ బిర్యానీ ఇటు కేరళవైపు మలబార్ బిర్యానీలు వాటి కమ్మదనాలతో మన కడుపును నింపుతున్నాయి. వాటి రుచులతో మన మతులు పోగోడుతున్నాయి.
ఇంకా ఎన్నో రకాల కొత్తకొత్త బిర్యానీలు పుట్టుకొస్తున్నే ఉన్నాయి. బొంగులో బిర్యానీ, అవకాయ బిర్యానీ, మండి బిర్యానీ అంటూ కొత్త రూపుతో వస్తున్నాయి. ఇలాగే మన బిర్యానీలు వర్ధిల్లుతుండాలి. వాటి రుచులను మనం ఆస్వాదించాలి అని కోరుకుందాం.
కొకొనట్ మిల్క్ బిర్యానీ
ఈరోజు బిర్యానీ డే సందర్భంగా మీకో కొత్త ఫ్లేవర్ బిర్యానీ రుచిని పరిచయం చేస్తున్నాం. అదేమిటంటే కొకొనట్ మిల్క్ బిర్యానీ. ఈ కొకొనట్ మిల్క్ బిర్యానీ కూడా మనం మామూలుగా చేసుకునే బిర్యానీలాగే చేసుకోవాలి. అయితే మనం చేసేటపుడు ఉడికించిన బిర్యానీ మసాలాలో, సగం బిడికిన బాస్మతి బిర్యానీని వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికిస్తాం కదా. అయితే అరకిలో బిర్యానీ వండుతున్నప్పుడు ఈ నీళ్లతో పాటు 150 మిల్లీలీటర్ల కొబ్బరిపాలు పోసి ఉడికించాలి. అప్పుడు మీ బిర్యానీకి ఒక కొత్త ఫ్లేవర్ జోడించినట్లు అవుతుంది. చాలా రుచికరంగా మారుతుంది కూడా. వీలైతే మీరు కూడా ప్రయత్నించి చూడండి.
సంబంధిత కథనం
టాపిక్